మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2020
Written By సెల్వి
Last Updated : శనివారం, 6 ఫిబ్రవరి 2021 (10:19 IST)

ఐపీఎల్ 2021లో శ్రీశాంత్.. రిజిస్టర్ చేసుకున్న అర్జున్ టెండూల్కర్

IPL
కాసుల వర్షం కురిపించే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) టి20 టోర్నీలో వివాదాస్పద భారత క్రికెటర్‌ శ్రీశాంత్‌ మళ్లీ ఆడేందుకు తహతహలాడుతున్నాడు. ఈ సీజన్‌ కోసం నిర్వహించే వేలంలో పాల్గొనేందుకు రూ. 75 లక్షల కనీస ధరతో తన పేరు నమోదు చేసుకున్నాడు. కానీ పోటీ తీవ్రంగా ఉన్న ప్రస్తుత తరుణంలో ఫిక్సింగ్‌ మరకలున్న అతనిపై ఏ ఫ్రాంచైజీ కన్నెత్తి చూస్తోందో వేచి చూడాలి. 
 
అలాగే భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ తనయుడు అర్జున్‌ టెండూల్కర్‌ కూడా ఈ వేలంలో తన పేరు నమోదు చేసుకున్నాడు. అర్జున్‌ రూ. 20 లక్షల కనీస ధరతో పేరును రిజిస్టర్‌ చేసుకున్నాడు. ఈ నెల 18న జరిగే ఆటగాళ్ల వేలానికి భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) రంగం సిద్ధం చేసింది.
 
మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీల్లో కేవలం 61 ఖాళీలే ఉన్న ఈ సీజన్‌ కోసం 1,097 మంది ఆటగాళ్లు వేలంలో పోటీపడుతున్నారు. మిషెల్‌ స్టార్క్, ప్యాటిన్సన్‌ (ఆస్ట్రేలియా), జో రూట్‌ (ఇంగ్లండ్‌)లాంటి అంతర్జాతీయ స్టార్లు ఈ వేలంలో పాల్గొనడం లేదు. వేలం బరిలో 814 మంది భారత ఆటగాళ్లు (21 అంతర్జాతీయ క్రికెటర్లు, 793 అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లు) ఉన్నారు. 283 మంది విదేశీ ఆటగాళ్లు ఫ్రాంచైజీల కంటపడేందుకు బోర్డు వద్ద తమ పేర్లను రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు.