శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 13 అక్టోబరు 2020 (18:12 IST)

పేటీఎం కేవైసీ అప్‌డేట్‌ పేరుతో మోసాలు.. ముఠా అరెస్ట్.. ఆ వివరాలు ఇవ్వొద్దు..?

పేటీఎం కేవైసీ అప్‌డేట్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠాను సైబరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. పేటియం యాప్ అప్‌డేట్‌ పేరుతో డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల నుంచి ఒక్క రూపాయి డిపాజిట్ చేయ్యాలని ఈ కేటుగాళ్లు కోరుతారని.. ఆ తరవాత ఖాతా వివరాలను సేకరించి రిమోట్ యాక్సెస్‌తో లక్షల రూపాయలు కొట్టేస్తారు. ఇలా ఎంతో మంది నగరంలో అకౌంట్‌లో నుండి డబ్బులను కోల్పోయారు.
 
ఈ మోసాలకు సంబంధించిన ఫిర్యాదులు హైదరాబాద్ పోలీసులకు అందాయి. నిఘా వర్గాల ద్వారా విచారణ జరపగా మోసం బయటపడినట్లు సీపీ సజ్జనార్‌ వెల్లడించారు. హైదరాబాద్‌ నగరానికి చెందిన వినయ్ శర్మ అనే బాధితుడి నుంచి రూ.4 లక్షల 29 వేలు కొట్టేశారని నిందితులను మంగళవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు.
 
ఈ మోసాలకు మూలం జార్ఖండ్‌లోని జంతార జిల్లా.. అని తేల్చారు అధికారులు. అక్కడి నుండే ఈ మోసాలు జరుగుతున్నట్లు గుర్తించామని సజ్జనార్‌ వెల్లడించారు. జార్ఖండ్ చెందిన నంకు మండల్ అలియాస్ రాహుల్, రాజేష్ మండల్, శివశక్తి కుమార్ అలియాస్ అమిత్ బర్నల్, గౌరవ్ అరుణ్, దిల్ ఖుష్ కుమార్ సింగ్‌లను అరెస్ట్ చేశామని తెలిపారు. నిందితుల నుంచి ఒక లక్ష 47వేల నగదు మొబైల్ ఫోన్లు డెబిట్, క్రెడిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. పేటీఎం అప్‌డేట్‌ పేరుతో గుర్తుతెలియని వ్యక్తులు వ్యక్తిగత వివరాలను అడిగితే ఎవరికీ ఇవ్వొద్దని పోలీసులు సూచించారు.