బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 17 అక్టోబరు 2022 (18:50 IST)

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ వద్దంటే.. ఆఫీసులకు వచ్చేది లేదు.. రిజైన్ చేస్తాం..?

Work From Home
దేశంలో కరోనా విజృంభించిన సమయంలో ఐటీ ఉద్యోగులకే కాకుండా ఇతర కంపెనీలు సైతం వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు కల్పించాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సంస్థలు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ని పక్కన పెట్టి కార్యాలయాలకు తిరిగి రావాలని ఉద్యోగులను కోరుతున్నాయి. 
 
అయితే యాజమాన్యాలు పంపిన మెయిల్స్‌కు ఉద్యోగులు ఉహించని విధంగా స్పందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో స్టాఫింగ్ సర్వీసెస్ సంస్థ (CIEL HR) జరిపిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
 
సర్వే ప్రకారం.. దాదాపు 88 శాతం మంది ఉద్యోగులు ఆఫీస్‌కు రావాలని ఒత్తిడి చేస్తే రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో 46 శాతం మంది ప్రస్తుతం వాళ్లు చేస్తున్న ఉద్యోగాల్ని పక్కనపెట్టి .. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ సదుపాయం ఉన్న ఉద్యోగాల కోసం అన‍్వేషిస్తున్నారట. కాగా, వీరిలో ఎక్కువ శాతం వర్కింగ్‌ మదర్స్‌ ఉ‍న్నారు.
 
ఇటీవల మూన్‌లైటింగ్‌ తెరపైకి వచ్చి సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దీంతో ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు వచ్చి పని చేయాలని సంస్థలు పట్టుబడుతున్నాయి. ప్రస్తుతం హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్ వంటి అగ్రశ్రేణి ఐటి సంస్థలు సైతం వారానికి కనీసం మూడు రోజులు ఉద్యోగులను కార్యాలయానికి పిలుస్తున్నాయి.