ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్ సభ ఎన్నికల సిత్రాలు
Written By జె
Last Modified: శనివారం, 30 మార్చి 2019 (17:34 IST)

చంద్రబాబును వెనకేసుకు రావడం కేజ్రీవాల్‌కు ప్లస్సా.. మైనస్సా?

ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌కి ప్రస్తుత రాజకీయాల్లో కాస్తంత విభిన్నమైన, చాలా ప్రత్యేకమైన పేరు ప్రఖ్యాతులున్నాయి. అన్నా హజారే చేపట్టిన అవినీతి వ్యతిరేక పోరాటానికి సంబంధించి ఆయన అనుచరుల్లో ఒకరిగా హల్‌చల్‌ చేసి, దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన కేజ్రీవాల్‌, సామాన్యుల ప్రతినిధిగా ఆమ్‌ ఆద్మీ పార్టీని స్థాపించి, అతి తక్కువ కాలంలోనే ఢిల్లీ ముఖ్యమంత్రిగా పదవి అందుకున్నారు. ఒకసారి కాదు, ఒకటికి రెండుసార్లు ఆయన ఆ పదవిని గెల్చుకున్నారు.
 
కాంగ్రెస్‌, బీజేపీలకు వ్యతిరేకంగా దేశంలో తామే ప్రత్యామ్నాయమన్న భావనను కలిగించడంలో కొంతమేర కేజ్రీవాల్‌ సఫలమయిన మాట వాస్తవం. కానీ, ఆ తర్వాత అనేక 'స్వీయ తప్పిదాలతో' అరవింద్‌ కేజ్రీవాల్‌ తన స్థాయిని తగ్గించుకున్నారు. ఇక అసలు విషయానికి వస్తే... బీజేపీ వ్యతిరేక కూటమి.. అంటూ చంద్రబాబు అంటున్న దరిమిలా, చంద్రబాబుకి కేజ్రీవాల్‌ 'అండగా' నిలబడటం రాజకీయాల్లో భాగమే కావొచ్చు. కానీ, నాలుగేళ్ళపాటు బీజేపీతో అంటకాగింది ఇదే చంద్రబాబు అన్న విషయాన్ని కేజ్రీవాల్‌ మర్చిపోతే ఎలా అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
 
పైగా, బీజేపీతో అంటకాగిన నాలుగేళ్ళలో, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, అరవింద్‌ కేజ్రీవాల్‌పై పలుమార్లు నోరు జారేశారు. ఆ విషయాలేవీ పట్టించుకోకుండానే, చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్‌ని అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో చదివేయడం హాస్యాస్పదం కాక మరేమిటి అంటున్నారు. మొత్తంగా 25 ఎంపీ సీట్లూ చంద్రబాబుకే కట్టబెట్టేయాలని కేజ్రీవాల్‌ ఓటర్లకి విజ్ఞప్తి చేస్తున్నారు.
 
పోనీ, ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ - ఆమ్‌ ఆద్మీ పార్టీ మధ్య పొత్తుల్లాంటివి ఏమన్నా వున్నాయా.? అంటే అదీలేదు. గెలిచేంత బలం లేకపోయినా, పార్టీ ఉనికి చాలా తక్కువగానే వున్నా, ఆంధ్రప్రదేశ్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీకి కొంతమంది మద్దతుదారులైతే వున్నారు.. జెండాలు పట్టుకు తిరుగుతున్నారు.. పరిస్థితుల్ని బట్టి ఆయా నియోజకవర్గాల్లో ఆయా పార్టీల అభ్యర్థులకీ ఆమ్‌ ఆద్మీ పార్టీ ఫాలోవర్స్‌ మద్దతునిస్తున్నారాయె. వాళ్ళ గురించి ఏమాత్రం పట్టించుకోకుండా, చంద్రబాబుని భుజాన మోసేందుకు వచ్చిన అరవింద్‌ కేజ్రీవాల్‌ని ఏమనాలో ఆయనే ఒకసారి ఆలోచించుకుంటే మంచిదంటున్నారు విశ్లేషకులు.