శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్ సభ ఎన్నికలు 2019 ప్రముఖ నియోజకవర్గం
Written By మోహన్
Last Updated : శుక్రవారం, 29 మార్చి 2019 (14:31 IST)

నారా లోకేష్‌పై జగన్ బాణం ఎంత ప్రభావం చూపబోతోంది..?

ఆంధ్రప్రదేశ్‌లో సాధారణ ఎన్నికలు చాలా మంది అభ్యర్థులకు పరీక్షగా మారాయి. అందులో ముందు వరుసలో ఉన్న వారిలో నారా లోకేష్..ప్రస్తుతం తన తండ్రి క్యాబినెట్‌లో మూడు మంత్రిత్వ శాఖల్లో పని చేసాడు. ఎమ్మెల్సీగానూ కొనసాగుతున్నాడు. కాగా ఇప్పుడు వచ్చిన ఎన్నికలు అతడికి సవాలుగా మారాయి. ప్రత్యక్ష ఎన్నికల్లో మొదటిసారి నిలబడిన లోకేష్ గెలవడం కోసం శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. 
 
ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా సర్వేలు నిర్వహించి, చివరకు మంగళగిరి నియోజకవర్గంలో తనయుడు లోకేష్ పోటీ చేస్తాడని ప్రకటించాడు. అప్పటి నుండి లోకేష్ హడావుడిగా ఆ నియోజకవర్గంలో తిరుగుతూ, ఓట్లు వేయాల్సిందిగా కోరుతున్నాడు. తనను గెలిపిస్తే మంగళగిరిని గచ్చిబౌలిలా చేస్తానని మాటిచ్చాడు. అనేక హామీలు గుప్పిస్తూ మంగళగిరి ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.
 
ఇదిలా ఉంటే 2014లో వైసీపీ నుండి గెలుపొందిన ఆళ్ల రామకృష్టారెడ్డి అప్పుడు కేవలం 12 ఓట్ల తేడాతో విజయం సాధించాడు. అతడు కూడా స్వంత ఖర్చులతో సంక్షేమ పథకాలు ప్రారంభించి మంగళగిరి ప్రజల్లో సానుభూతిని సంపాదించుకున్నాడు. రాజన్న క్యాంటిన్ పేరుతో కేవలం 4 రూపాయలతో కోడిగుడ్డుతో సహా భోజనం పెట్టడం, 10 రూపాయలకు 7 రకాల కూరగాయలను పట్టణ ప్రజలకు అందించడం వల్ల అతనిపై కూడా ప్రజల్లో సానుకూలత ఉంది. అందులోనూ ఆయన స్థానికుడు కావడం అతడికి కలిసివచ్చే అంశం.
 
మరోవైపు ఇతర పార్టీలు అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ, పోటీ మాత్రం రెండు పార్టీల మధ్యే ఉంటుందని అంచనా..చంద్రబాబు చేసిన అభివృద్ధి తనను గెలిపిస్తుందని నారా లోకేష్ ధీమా వ్యక్తం చేస్తుండగా ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి కూడా గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే వైసీపీ అధ్యక్షుడు జగన్ సోదరి షర్మిలను రంగంలోకి దించుతున్నాడు. 
 
షర్మిల ఇప్పటికే ప్రెస్ మీట్ పెట్టి మరీ నారా లోకేష్‌ని తీవ్రంగా విమర్శించింది. ఇప్పుడు ఏకంగా మంగళగిరి నుండే తన ప్రచారాన్ని మొదలుపెట్టనుంది. షర్మిల రాకతో మంగళగిరి రాజకీయం మరింత వేడెక్కింది. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో నువ్వా నేనా అని పోటీ పడే నియోజకవర్గాల్లో మంగళగిరి మొదటి స్థానంలో నిలవనుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అభ్యర్థులు అందరూ తన విజయంపై ధీమా వ్యక్తం చేస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు.