యూపీ: తండ్రి అంత్యక్రియలకు వెళ్తుండగా యాక్సిడెంట్.. ఆరుగురు మృతి
యూపీలోని శ్రావస్తి జిల్లాలో శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. ఐకోనా పోలీస్ స్టేషన్ పరిధిలోని సోన్‌రాయ్ గ్రామ సమీపంలో శనివారం ఇన్నోవా కారు అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఇన్నోవాలో ఉన్న వారంతా తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు పంజాబ్ నుంచి శ్రావస్తిలోని కర్మోహన గ్రామానికి వస్తున్నారు.
ఈ ఘటనలో క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన ఎనిమిది మందిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా వుంది. ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేసారు.