సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 23 జులై 2020 (16:25 IST)

కరోనా వారియర్స్ చనిపోతే రూ.కోటి : ఢిల్లీ సర్కారు

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ దెబ్బకు ప్రతి ఒక్కరూ వణికిపోతున్నారు. ఈ వైరస్ నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రజలు ఇళ్లు వదిలి బయటకు రావడంలేదు. కానీ, వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, ఆంబులెన్స్ సిబ్బంది మాత్రం తమ ప్రాణాలకు తెగించి కరోనా రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు. అందుకే వీరిని కరోనా వారియర్స్‌గా పిలుస్తున్నారు. 
 
ఇలాంటి వారిలో కొందరు ఈ వైరస్ బారినపడి చనిపోతున్నారు కూడా. ఇటీవల ఢిల్లీలో ఓ పోలీసు కానిస్టేబుల్ ఈ వైరస్‌కు చనిపోయాడు. ఆయన కుటుంబానికి సంతాపం వ్యక్తం చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ఆ కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియో ప్రకటించారు. 
 
అంతేకాకుండా కరోనా వారియర్లు ఎవరైనా కోవిడ్-19 వల్ల మరణించినా వారందరి కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియో అందజేస్తామని ప్రకటించారు. ఈ విషయాన్ని తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఫ్రంట్‌లైన్ కోవిడ్19 వారియర్స్ అందరికీ ఈ ఎక్స్‌గ్రేషియో వర్తిస్తుందని ఢిల్లీ సీఎంవో పేర్కొంది.
 
'అమిత్ జీ తన జీవితాన్ని పట్టించుకోకుండా ఢిల్లీ ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నాడు. కానీ దురృష్టవశాత్తూ అతడు కరోనా బారిన పడి మరణించాడు. ఢిల్లీ ప్రజలందరి తరపున ఆయన చేసిన త్యాగానికి నేను నివాళులర్పిస్తున్నాను. అంతేకాకుండా అతడి కుటుంబానికి ఒక కోటి రూపాయల ఎక్స్-గ్రేటియా ఇస్తామని ప్రకటిస్తున్నాం' అంటూ ట్వీట్ చేశారు.