గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 15 జూన్ 2020 (09:41 IST)

ఢిల్లీలో నిండుకున్న ఐసీయూ వార్డులు - ఆస్పత్రులుగా హోటల్స్ - బాంకెట్ హాల్స్

కరోనా వైరస్ దెబ్బకు దేశ రాజధాని ఢిల్లీ నగరం వణికిపోతోంది. దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రంలో ఢిల్లీ మూడో స్థానంలో ఉంది. ప్రతి రోజూ వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఢిల్లీలోనీ ఆస్పత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోవడంతో ఆస్పత్రుల కొరత ఏర్పడనుంది. ఈ పరిస్థితిని అధికమించేందుకు హోటల్స్, బాంకెట్ హాల్స్‌ను ఆస్పత్రులుగా వినియోగించుకోవాలని ఢిల్లీ సర్కారు భావిస్తోంది. 
 
ఇదే అంశంపై ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా స్పందిస్తూ, ప్రస్తుతం ఢిల్లీలో 38 వేలకు పైగా కేసులుండగా, ప్రస్తుతం కేసుల సంఖ్య రెట్టింపవుతున్న సమయాన్ని బట్టి, జూలై నెలాఖరు నాటికి మొత్తం 5.5 లక్షల కేసులు ఢిల్లీలో ఉంటాయని అంచనా వేస్తున్నట్టు ఆయన తెలిపారు. 
 
మున్ముందు ఉత్పన్నమయ్యే కరోనా పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని చర్యలూ చేపట్టామని తెలిపారు. వచ్చే వారం రోజుల వ్యవధిలో పలు హోటల్స్, వాటిల్లోని బాంకెట్ హాల్స్ లో 20 వేల బెడ్లను సిద్ధం చేయాలని ప్రభుత్వం ప్రణాళికలను తయారు చేసిందని తెలిపారు. 
 
ఇప్పటికే 80 బాంకెట్ హాల్స్‌ను గుర్తించామని, వాటిల్లో 11 వేల బెడ్లను ఏర్పాటు చేసి, వాటిని నర్సింగ్ హోమ్స్‌కు అటాచ్ చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. దీనికి అదనంగా 40 ప్రైవేటు హోటళ్లలో 4 వేల పడకలను సిద్ధంగా ఉంచి, వాటిని ప్రైవేటు ఆసుపత్రులకు అనుసంధానం చేయాలని భావిస్తున్నట్టు తెలిపారు. ప్రతి నర్సింగ్ హోంలో 10 నుంచి 49 బెడ్లను కరోనా రోగుల కోసం ప్రత్యేకంగా కేటాయించి వుంచాలని ఆదేశించనున్నారు.
 
కాగా, ఢిల్లీలో పెరుగుతున్న కేసుల సంఖ్యను అనుసరించి, వైద్య సదుపాయాల కల్పనకు, కేసుల అణచివేతకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఆదివారం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, వైద్య మంత్రి హర్షవర్ధన్‌లతో చర్చించిన సంగతి తెలిసిందే.