గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 14 జూన్ 2020 (15:19 IST)

కరోనా విశ్వరూపం : నిండుకున్న ఐసీయూ వార్డులు.. రైల్వే కోచ్‌లే దిక్కు!!

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విశ్వరూపం దాల్చుతోంది. ఈ వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. దీంతో కోవిడ్ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన పడకలు కూడా నిండుకున్నాయి. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో వైద్య వర్గాలు ఉన్నాయి. 
 
ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో ఈ వైరస్ విలయతాండవం చేస్తోంది. ఇప్పటివరకు 36 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,214 మంది మృత్యువాత పడ్డారు. నిత్యం వందల సంఖ్యలో కొత్త కేసులు వెలుగుచూస్తుండడంతో ఆసుపత్రులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. 
 
బెడ్లు ఖాళీ లేక రోగులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. బయటి వారికి తాము వైద్యం చేయలేమని సీఎం చేతులెత్తేసే పరిస్థితి కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ దయనీయ పరిస్థితిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. దేశ రాజధానిలో కరోనా పరిస్థితులపై కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌లతో కలిసి ఆదివారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, ఢిల్లీ ప్రజల రక్షణ కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. కరోనా రోగులకు పడకల కొరత దృష్ట్యా రైల్వే కోచ్‌లు కేటాయిస్తున్నామని తెలిపారు. ఢిల్లీకి కేంద్రం 500 రైల్వే కోచ్‌లను అందిస్తుందని వెల్లడించారు. రైల్వే కోచ్‌ల ద్వారా 8 వేల బెడ్లు అందుబాటులోకి వస్తాయని అమిత్ షా వివరించారు. 
 
ఈ రైల్వే కోచ్‌లో కరోనా రోగులకు అన్ని సదుపాయాలు ఉంటాయన్నారు. వచ్చే రెండ్రోజుల పాటు ఢిల్లీలో కరోనా టెస్టులు రెట్టింపు చేయాలని, మరో 6 రోజుల్లో మూడు రెట్లు పరీక్షలు నిర్వహించాలని సూచించారు. దేశ రాజధానిలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా రోగులకు చికిత్స కోసం కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.