శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 27 జూన్ 2023 (19:51 IST)

కేసీఆర్ కుమార్తె బాగుండాలంటే బీఆర్ఎస్‌కు ఓటు వేయండి : ప్రధాని మోడీ

narendra modi
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, సీఎం కేసీఆర్ కుమార్తె కె.కవిత బాగుండాలంటే భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కు ఓటు వేయాలని, దేశ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలంటే భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి ఓటు వేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్‌‍లో నిర్వహించిన 'మేరా బూత్.. సబ్సే మజబ్బూత్' కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొని.. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. 
 
ఈ సందర్భంగా కుటుంబ పార్టీలపై ఆయన మరోమారు విమర్శలు గుప్పించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబంపై విమర్శలు గుప్పించారు. అదేవిధంగా.. ఇటీవలి విపక్షాల భేటీపై ధ్వజమెత్తారు. 'అవినీతిపై చర్యలు తీసుకోవడంతోపాటు 2024 ఎన్నికల్లో బీజేపీ గెలవనున్న నేపథ్యంలోనే ప్రతిపక్షాలన్నీ ఒకచోట చేరాయి. ఆ పార్టీలన్నీ అవినీతి, కుంభకోణాలకు హామీ ఇస్తాయి. నేను మాత్రం అవినీతిపరులను వదిలిపెట్టేదే లేదన్న హామీ ఇస్తున్నా' అని వ్యాఖ్యానించారు. 
 
బీజేపీకి కార్యకర్తలే అతిపెద్ద బలమని మోడీ పేర్కొన్నారు. తాము ఏసీ గదుల్లో కూర్చొని ఆదేశాలు జారీ చేయమని.. ప్రజలతో మమేకమయ్యేందుకు కఠిన వాతావరణ పరిస్థితులనూ ధైర్యంగా ఎదుర్కొంటామని తెలిపారు. పార్టీకి చెందిన ప్రతి కార్యకర్తకు దేశ ప్రయోజనాలే ప్రధానం. పార్టీకన్నా దేశమే పెద్దదని ప్రధాని మోడీ అన్నారు. బుజ్జగింపులు, ఓటు బ్యాంకు రాజకీయాలు చేయకూడదని భాజపా నిర్ణయించుకున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు. 
 
'ట్రిపుల్ తలాక్ను సమర్థిస్తున్నవారు.. ముస్లిం బిడ్డలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు. అయితే.. ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాలకు భాజపా దూరం. ఉమ్మడి పౌరస్మృతి పేరిట కొన్ని పార్టీలు ప్రజలను రెచ్చగొడుతున్నాయి. అయితే.. వేర్వేరు చట్టాలతో దేశాన్ని ఎలా నడపాలి? ఒకే కుటుంబంలోని సభ్యులకు వేర్వేరు నిబంధనలు పని చేయవు. రాజ్యాంగం కూడా సమాన హక్కుల గురించి చెబుతోంది. అయితే.. ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఈ వ్యవహారంపై ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయి' అని విమర్శించారు.