రాజస్థాన్ నుంచి వెంకయ్య.. కర్ణాటక నుంచి నిర్మలా సీతారామన్
రాజ్యసభ ఎన్నికల కోసం కమలనాథులు ఊహించని నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో కర్ణాటక నుంచి పోటీచేసేందుకు సిద్ధమైన కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి ఎం.వెంకయ్యనాయుడిని ఆకస్మికంగా రాజస్థాన్ నుంచి బరిలోకి దించుతున్నట్లు బీజేపీ ప్రకటించింది. అలాగే, ఆయన స్థానంలో కేంద్ర వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్‌ను కర్ణాటక నుంచి ఎగువ సభకు అభ్యర్థిగా ఖరారు చేసింది.
దేశ వ్యాప్తంగా బీజేపీకి బలమున్న రాష్ట్రాల్లో పార్టీ గెలిచే అవకాశమున్న 15 స్థానాలకు గాను 12 మంది అభ్యర్థులను బీజేపీ నాయకత్వం ఆదివారం ప్రకటించింది. మూడు స్థానాలకు ఇంకా ఖరారుచేయాల్సి ఉంది. దక్షిణాది నేతగా ముద్రపడిన వెంకయ్యనాయుడు ఇప్పటివరకూ కర్ణాటక నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఆ రాష్ట్రం నుంచి ఆయనపై వ్యతిరేకత వచ్చినా రాష్ట్ర నాయకత్వం ఆయన పేరునే సిఫారసు చేసింది. వెంకయ్య సన్నిహితులు సైతం కర్ణాటక నుంచే ఆయన నాలుగోసారి రాజ్యసభకు ఎన్నికవుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. చివరి నిమిషంలో బీజేపీ అధినాయకత్వం ఆయన్ను రాజస్థాన్‌కు మార్చడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. వెంకయ్యను కర్ణాటక నుంచి మార్చి ఆ స్థానాన్ని నిర్మలతో భర్తీ చేశారు.
అదేసమయంలో మహారాష్ట్రలో శివసేన నాయకుడైన సురేశ్ ప్రభుకు పొత్తులో భాగంగా రెండేళ్ల కిందట కేంద్ర మంత్రి పదవిని, రైల్వే శాఖను ప్రధాని నరేంద్ర మోడీ కట్టబెట్టగా.. ఆయన అభ్యర్థిత్వంపై శివసేన అభ్యంతరం తెలిపింది. దీంతో ఆయన్ను బీజేపీ హర్యానా నుంచి రాజ్యసభకు పంపింది. ఆయన పదవీకాలం కూడా ముగిసింది. ఈసారి మహారాష్ట్ర నుంచి ముగ్గురు అభ్యర్థుల్ని ఎన్నుకునే అవకాశం ఉన్న బీజేపీ పీయూష్ గోయల్‌ను మాత్రమే ప్రకటించింది. మరో రెండు స్థానాల్లో ఒకటి సురేశ్ ప్రభుకు ఇస్తారని ప్రచారం జరుగుతున్నా.. ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయన్ను రాజ్యసభకు పంపిస్తారని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి.
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోపు రాష్ట్రానికి రైల్వే జోన్ ప్రకటించే యోచనలో కేంద్రం ఉందని, ఇలాంటప్పుడు రాష్ట్రం నుంచి రైల్వే మంత్రి ప్రాతినిధ్యం వహించడం రాజకీయంగా కలిసొచ్చే అంశమని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు... ఆంధ్ర నుంచి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్‌ను బరిలోకి దించాలని పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు మరో ప్రచారం నడుస్తోంది.