మంగళవారం, 27 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 13 డిశెంబరు 2022 (12:27 IST)

కుమార్తె పెళ్లి మెహంది వేడుకలో డ్యాన్స్ చేస్తూ చనిపోయిన తండ్రి... పుట్టెడు దుఃఖంలోనే...

marriage
ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని అల్మోరాలో ఓ విషాదకర ఘటన జరిగింది. తన కుమార్తె పెళ్ళి మెహంది వేడుకలో డ్యాన్స్ చేస్తూనే కన్నతండ్రి కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. అంతటి దుఃఖంలోనూ వధువు కుటుంబ సభ్యులు పెళ్ళితుంతు పూర్తి చేశారు. తండ్రి గురించి అడిగిన వధువుకు ఆస్పత్రికి వెళ్లారని చెప్పి, మేనమామతో కన్యాదానం చేయించారు. 
 
ఈ విషాదకర ఘటన వివరాలను పరిశీలిస్తే, అల్మోరాకు చెందిన ఓ యువతికి ఆదివారం వివాహం జరగాల్సివుంది. దీంతో శనివారం మెహంది వేడుకను నిర్వహించారు. ఈ వేడుకలో వధువు తండ్రి ఆనందంగా డ్యాన్స్ చేస్తూ, ఒక్కసారిగా గుండెపోటుకుగురై ప్రాణాలు కోల్పోయాడు. ఆ వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించగా, ఆయన మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. 
 
అయితే, ఈ విషయం వధువుకు తెలిస్తే పెళ్ళికి ఎట్టిపరిస్థితుల్లోనూ సమ్మతించబోదని భావించిన కుటుంబ సభ్యులు తండ్రి మృతివార్తను ఆమెకు తెలియకుండా దాచిపెట్టారు. ఆ తర్వాత పుట్టెడు దుఃఖాన్ని గుండెల్లోనే దాచిపెట్టుకుని ఆదివారం హల్ద్వాలోని ఓ ఫంక్షన్ హాలులో వివాహం జరిపించారు. 
 
కన్యాదానాన్ని వధువు తండ్రి స్థానంలో మేనమామ నిర్వహించారు. దీనికి కూడా వధువు అంగీకరించలేదు. అయితే, ఆరోగ్యం బాగోలేకపోవడంతో పరీక్షల కోసం ఆయన ఆస్పత్రికి వెళ్ళారని త్వరలోనే వచ్చేస్తారని చెప్పి కన్యాదానంతో పాటు పెళ్ళితంతును కూడా పూర్తి చేశారు.