ఆదివారం, 24 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 15 అక్టోబరు 2022 (12:19 IST)

ప్రేమోన్మాదం యువతి.. తండ్రి బలవన్మరణం.. తల్లి క్యాన్సర్ పేషెంట్..!

crime scene
ప్రేమ ఉన్మాదంగా మారిపోయింది. యువతి హత్యకు దారితీసింది. అంతటితో ఆగలేదు. కుమార్తె మరణం తట్టుకోలేక ఆ తండ్రి కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇవి చాలదన్నట్లు ఇప్పటికే క్యాన్సర్‌తో పోరాడుతున్న యువతి తల్లి.. చక్కని కుటుంబంలో చోటుచేసుకున్న ఈ విషాధాలతో నిస్సహాయురాలిగా రోదిస్తోంది. క్షణికావేశంలో ఓ ప్రేమోన్మాది చేసిన పాడుపనికి యువతి కుటుంబం కోలుకోలేని స్థితికి చేరుకుంది.

వివరాల్లోకి వెళితే.. తమిళనాడులో గురువారం సత్య అనే యువతిని ప్రేమోన్మాది సతీష్ రైలు కిందకు తోసేసి చంపేశాడు. చెన్నై ఆదంబాక్కం రాజా వీధి పోలీస్ క్వార్టర్స్‌కు చెందిన మాణిక్యం, రామ లక్ష్మి దంపతులు. రామలక్ష్మి ఆదంబాక్కం పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. వీరి కుమార్తె సత్య (20) చెన్నై టీనగర్‌లో కాలేజీ సెకండియర్ చదువుతోంది.

ఈమెను అదే ప్రాంతానికి చెందిన విశ్రాంత ఎస్సై దయాళన్ కుమారుడు సతీష్ ప్రేమించాడు. అయితే అతడి ప్రేమను ఆమె అంగీకరించలేదు. దీంతో వేధించడం మొదలెట్టాడు. దీంతో గురువారం సత్య కాలేజీ కోసం రైల్వే స్టేషన్‌లో నిలుచుని వుండగా అక్కడకి వచ్చిన సతీష్ రైలు కిందకు తోసేశాడు.

దీంతో యువతి ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడిని పోలీసులు శుక్రవారం సైదాపేట కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఈ నెల 28వ తేదీ వరకు రిమాండ్ విధించింది.

మరోవైపు కుమార్తె మరణాన్ని జీర్ణించుకోలేక పోయిన ఆమె తండ్రి శుక్రవారం ఉదయం మద్యంలో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇక తల్లి రామలక్ష్మి క్యాన్సర్ బాధితురాలు. తండ్రి, కుమార్తెల మృతదేహాలను చూసి ఆమె రోదించడం స్థానికులను కలచివేసింది.