ఇంట్లో చిల్లిగవ్వలేదు.. దొంగలకు చిర్రెత్తుకొచ్చింది.. చివరికి ఏం చేశారంటే?
ఇంట్లో దొంగతనానికి వచ్చిన దొంగలకు చిర్రెత్తుకొచ్చింది. ఇంటి మొత్తం వెతికారు కానీ ఏమీ దొరకలేదు. చివరికి ఇంటి యజమానులను నిలదీశారు. ఇంట్లో ఏమీ వుంచరా అంటూ గదమాయించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమిళనాడులోని చెన్నైలో గల గుమ్మడిపుండి ఏరియాలో ఒక ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. రెండు అంతస్థుల భవనంలో నివాసముంటున్న ఏకాబరం, కాసియమ్మల్ అనే దంపతులకు ఒక కొడుకు. ఆయన తన భార్యాపిల్లలతో పై అంతస్థులో ఉంటున్నాడు. కింద వృద్ధ దంపతులు ఉంటున్నారు.
కాగా నాలుగు రోజుల క్రితం ఆ దంపతులు ఉంటున్న ఇంట్లోకి రాత్రి 9 గంటల సమయంలో ఐదుగురు సభ్యుల ముఠా ఒకటి ప్రవేశించింది. అప్పుడే భోజనం చేసి ఇక నిద్రపోదామనుకుంటున్న ఆ దంపతులకు బెదిరించి ఇంటిని దోచుకోవాలనుకున్నారు. బెడ్ రూం, బీరువాలు, అల్మారాలు, సెల్ఫ్స్.. అన్నీ వెతికారు. చిల్లి గవ్వ కూడా దొరకలేదు. దీంతో చిర్రెత్తుకొచ్చిన దొంగల ముఠా... ఆ దంపతుల దగ్గరకు వచ్చారు. వస్తూ వస్తూనే.. ఇంత పెద్ద ఇల్లు కట్టుకుని విలువైన వస్తువులు ఎందుకు ఉంచలేదని నిలదీశారు. ఇంట్లో చీరలు, దోతులు, గిన్నెలు తప్ప బంగారం.. వెండి వంటివి ఏమీ లేవని ఊగిపోయారు. విలువైన వస్తువులుల ఎందుకు కొనలేదని ఆ దంపతులను కొట్టినంత పనిచేశారు. కానీ ఆ దంపతుల నోట మాట పెకల్లేదు.
చివరికి కిచెన్, పూజ గదిలోకి వెళ్లి.. వెండి గిన్నెలు సంపాదించారు. బీరువాలోకి వెళ్లి కొన్ని చీరలను తీసుకుని.. అసంతృప్తితో అక్కడ్నుంచి బయల్దేరారు. పోతూ.. పోతూ.. ఇంట్లో విలువైన వస్తువులను దాచనందుకు రూ. 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కానీ అంతలోనే పై నుంచి ఏదో అలికిడి వినబడిన తర్వాత ఆ ముఠా అక్కడ్నుంచి ఉడాయించింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు. వారిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.