బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 18 ఫిబ్రవరి 2021 (11:43 IST)

పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నరుగా తమిళిసై సౌందర్ రాజన్

రాష్ట్ర హోదా కలిగిన కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి కొత్త లెఫ్టినెంట్ గవర్నరుగా తెలంగాణ రాష్ట్ర గవర్నరు తమిళిసై సౌందర్ రాజన్‌ను కేంద్రం నియమించింది. దీంతో ఆమె గురువారం బాధ్యతలు స్వీకరించారు. 
 
ప్రస్తుతం తెలంగాణ గవర్నర్‌గా ఉన్న ఆమె పుదుచ్చేరి ఎల్జీగా అదనపు బాధ్యతలు స్వీకరించారు. అక్కడి రాజ్‌భవన్‌లో తమిళిసై చేత మద్రాస్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయించారు. 
 
ఈ కార్యక్రమంలో ఆ ప్రాంత ముఖ్యమంత్రి నారాయణస్వామి పాల్గొన్నారు. ఎల్జీగా బాధ్యతలు చేపట్టడానికి నిన్న రాత్రి పుదుచ్చేరి చేరుకున్న తెలంగాణ గవర్నర్‌ తమిళిసైకి సీఎం నారాయణస్వామి స్వాగతం పలికారు. 
 
పుదుచ్చేరిలో నెలరోజుల వ్యవధిలో అధికార కాంగ్రెస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో అక్కడి ప్రభుత్వం సంక్షోభంలో పడింది. దీంతో అక్కడి రాజకీయాలు అనూహ్య మలుపులు తిరిగాయి. ఈ క్రమంలో పుదుచ్చేరికి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా ఉన్న కిరణ్‌బేదీని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈ నెల 16న తొలగించిన విషయం తెలిసిందే.