శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 20 ఏప్రియల్ 2019 (15:10 IST)

'నువ్వు కూడా నన్ను కౌగిలించుకో'.... సుప్రీం సీజేపై మాజీ మహిళ ఉద్యోగి ఆరోపణలు

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌పై ఓ మాజీ మహిళా ఉద్యోగిని సంచలన ఆరోపణలు చేసింది. రంజన్ గగోయ్ తనను లైంగికంగా వేధించారంటూ ఆరోపించింది. ఈ మేరకు జూనియర్ కోర్టు అసిస్టెంట్‌గా పనిచేస్తున్న 35 యేళ్ల మహిళ ఆరోపించింది. తన నివాస కార్యాలయంలో రంజన్ గొగోయ్ తనపై లైంగిక వేధింపులకు దిగారని ఆవేదన వ్యక్తంచేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టులోని 22 మంది జడ్జీలకు ఓ అఫిడవిట్‌ను పంపించారు. పైగా, దీనిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. 
 
ఆ మహిళ పంపిన అఫిడవిట్‌లో... 'రంజన్ గొగోయ్ వెనుక నుంచి నా నడుం చుట్టు చేయివేసి నన్ను గట్టిగా పట్టుకున్నారు. చేతులతో నా శరీరమంతా తడిమారు. అనంతరం గట్టిగా హత్తుకున్నారు. 'నువ్వు కూడా నన్ను కౌగిలించుకో' అని కోరారు. దీంతో ఆయన నుంచి తప్పించుకోవడానికి నేను పెనుగులాడాను. ఆయన నుంచి తప్పించుకుని బయటపడ్డాను. ఇది జరిగిన 2 నెలలకే నన్ను ఉద్యోగం నుంచి తొలగించారు. అనుమతి లేకుండా ఒకరోజు సెలవు తీసుకున్నందుకు నన్ను సర్వీసు నుంచి తొలగించారు. 
 
పైగా, ఈ వేధింపులు అక్కడి నుంచి ఆగిపోలేదు. నా భర్త, నా బావ ఢిల్లీ పోలీస్ శాఖలో హెడ్‌కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్నారు. వీరిద్దరిని 2012లో జరిగిన ఓ కాలనీ వివాదంలో గతేడాది డిసెంబర్ 28న సస్పెండ్ చేశారు. నేను నా భర్తతో కలిసి రాజస్థాన్‌లో ఉండగా ఓ చీటింగ్ కేసులో ఢిల్లీ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. నేను సుప్రీంకోర్టులో ఉద్యోగం ఇప్పిస్తానని ఓ వ్యక్తి నుంచి రూ.50 వేలు తీసుకున్నట్లు తప్పుడు ఫిర్యాదు చేయించారు. మా ఇద్దరిని మాత్రమే కాకుండా మా బావ కుటుంబ సభ్యులను కూడా అదుపులోకి తీసుకుని అవమానించారు.
 
24 గంటల పాటు కనీసం నీళ్లు ఇవ్వకుండా చేతులకు బేడీలు వేసి, దూషించడంతో పాటు భౌతికంగానూ దాడిచేశారు. నేను క్షమాపణ చెప్పాలని రంజన్ గొగోయ్ భార్య డిమాండ్ చేసింది. అయితే తాను ఎందుకు క్షమాపణ కోరుతుందో ఆమెకు కూడా తెలియదు. ఆమె చెప్పినట్లే ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాను. అయినా నాకు వేధింపులు ఆగలేదు. దివ్యాంగుడైన మా బావ సుప్రీంకోర్టులో తాత్కాలిక జూనియర్ అటెండెంట్‌గా గతేడాది అక్టోబర్ 9న నియమితులయ్యారు. ఆయన్ను అకారణంగా సీజేఐ గొగోయ్ తప్పించారు' అని ఆమె ఆరోపించింది.