శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 8 ఆగస్టు 2020 (13:01 IST)

కోజికోడ్ ఘటన.. కాక్‌పిట్‌ విరగ్గొట్టిన తర్వాత పైలట్‌‌ను బయటికి తీశారు..

Kozhikode plane crash
కోజికోడ్ విమాన ప్రమాదం ఘటన బాధితుల ఆర్తనాదాలు వినిపిస్తూనే వున్నాయని పోలీసులు, సహాయక సిబ్బంది వాపోతున్నారు. ఈ ఘటనకు సంబంధించి బాధితులను రక్షించేందుకు వర్షాల్లో నానా తంటాలు పడ్డామని చెప్తున్నారు. ఇంకా ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడిన వారంతా తమ విషాధకరమైన సంఘటనలను గుర్తు చేసుకుంటున్నారు. 
 
దుబాయి నుంచి కోజికోడ్ చేరుకున్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం రన్‌వేపై జారిపడటంతో చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 19మంది మరణించగా.. 100 మందికిపైగా గాయపడిన విషయం తెలిసిందే. నిన్న రాత్రి అక్కడ నెలకొన్న భీతావహ దృశ్యాలను స్థానికులు వివరించారు. ఓ వైపు భారీ వర్షం కురుస్తుండగానే సహాయక బృందాలు, స్థానిక పోలీసులు అక్కడికి చేరుకొన్నారు. రెండుగా విరిగిపోయిన విమాన శకలాల నుంచి క్షతగాత్రులను బయటకు తీశారు. 
 
కానీ ప్రయాణికులకు మాత్రం ఆ క్షణం ఏం జరిగిందో తెలియని ఆందోళన. ఆ భయానక క్షణాల్లో వారి అరుపులతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. దీంతో పాటు నాలుగైదేళ్ల చిన్నారులు, ప్రయాణికులు అనుభవించిన వేదన వర్ణనాతీతం. తీవ్ర ఆందోళనకు గురైన స్థానికులు సరైన సమయానికి అక్కడికి చేరుకొని సహాయక చర్యల్లో భాగస్వాములయ్యారు.
  
విమాన ప్రమాదం సమయంలో అక్కడ ఉన్న పరిస్థితిపై ఓ స్థానికుడు మాట్లాడుతూ.. ''భయంకరమైన శబ్దం విని నేను అక్కడికి పరుగులు తీశాను. చిన్నారులు కొందరు సీట్ల కింద ఇరుక్కుపోయి ఉన్నారు. ఆ ప్రాంతమంతా దుఖఃసంద్రంగా మారింది. మేం అక్కడికి వెళ్లేసరికే కొందరు కింద పడిపోయి ఉన్నారు. చాలా మంది గాయపడ్డారు. కొందరి కాళ్లు విరిగాయి. నా చేతులు, చొక్కా రక్తంతో తడిసిపోయాయి'' అని వివరించాడు.
 
గాయపడిన పైలట్‌ను కాక్‌పిట్‌ విరగ్గొట్టిన తర్వాత బయటకు తీశారని మరో వ్యక్తి వివరించాడు. అంబులెన్స్‌లు ఘటనా స్థలానికి చేరుకొనేటప్పటికే కొందరు స్థానికులు కార్లు, ఇతర వాహనాల్లో క్షతగాత్రులను కోజికోడ్‌, మలప్పురం జిల్లాల్లోని ఆస్పత్రులకు తీసుకెళ్లారని తెలిపాడు.
 
కేరళలోని కోజికోడ్ ‌ విమానాశ్రయం రన్‌వేపై శుక్రవారం చోటు చేసుకున్న విమాన ప్రమాద ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. విమానం నుంచి బ్లాక్బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు డీజీసీఏ వెల్లడించింది. ఇందులో ఉండే డిజిటల్‌ ఫ్లైట్‌ డేటా రికార్డర్‌ (డీఎఫ్‌డీఆర్‌), కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్‌ (సీవీఆర్‌)లలో నిక్షిప్తమైన సమాచారాన్ని విశ్లేషించనున్నారు.