సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 29 జులై 2020 (08:40 IST)

రాఫెల్ ఫైటర్ జెట్ విమానం నడిపిన తొలి భారత పైలెట్ ఎవరు?

భారత్ - ఫ్రాన్స్ దేశాల మధ్య కుదిరిన రక్షణ ఒప్పందాల్లో భాగంగా రాఫెల్ యుద్ధ విమానాలు భారత్‌కు వస్తున్నాయి. ఇప్పటికే తొలి దఫా విమానాలు భారత్‌కు వచ్చాయి. తాజాగా ఫ్రాన్స్ నుంచి బయలుదేరిన రాఫెల్ ఫైటర్ జెట్‌ను నడిపిన తొలి భారత పైలట్‌గా ఎయిర్ కమాండర్ హిలాల్ అహ్మద్ రాథోడ్ చరిత్ర సృష్టించారు. 
 
తొలి బ్యాచ్‌లో భాగంగా డెలివరీ అయిన ఐదు విమానాల్లో ఒకదాన్ని కాశ్మీర్‌కు చెందిన హిలాల్ నడిపారు. వైమానిక దళంలో కమాండర్‌గా ఉన్న హిలాల్, మిరేజ్ 2000, మిగ్ 21 తదితర ఫైటర్ జెట్‌లపై 3 వేలకు పైగా ఫ్లయింగ్ అవర్స్‌ను విజయవంతంగా పూర్తిచేశారు. 
 
ప్రపంచంలోని ఉత్తమ ఫ్లయింగ్ అధికారిగా ఆయన గుర్తింపు పొందారు. ఆయన తండ్రి మొహమ్మద్ రాథోడ్ డీఎస్పీగా పనిచేశారు. మన దేశ రక్షణ అవసరాల నిమిత్తం రాఫెల్ యుద్ధ విమానాలను మార్చే విషయంలోనూ ఆయన తనవంతు సహకారాన్ని అందించారు. 
 
గాల్లోనే ఇంధనం ఫిల్ 
మరోవైపు, సోమవారం ఉదయం ఫ్రాన్స్ నుంచి భారత్‌కు రాఫెల్ యుద్ధ విమానాలు బయలుదేరాయి. ఐదు విమానాలు ఫ్రాన్స్ నుంచి దాదాపు 7 వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి బుధవారం భారత్‌కు చేరుకోనున్నాయి. అందుకే వీటి వెంట ఓ ఇంధన ట్యాంకర్ విమానం కూడా వచ్చింది.
 
ఈ క్రమంలో గాల్లోనే రాఫెల్ విమానాలు ఇంధనం నింపుకున్నాయి. దీనికి సంబంధించిన ఫొటోలను ఫ్రాన్స్‌లోని భారత దౌత్య కార్యాలయం సోషల్ మీడియాలో పంచుకుంది. కాక్ పిట్ సమీపంలో ఉన్న ఓ పైప్ ద్వారా రాఫెల్ విమానాలు ఇంధనం నింపుకున్నాయి. దాదాపు 30 వేల అడుగుల ఎత్తులో ఇంధనం నింపుకునే ప్రక్రియను విజయవంతంగా ముగించాయి.