అయోధ్యపై అంతిమ తీర్పు.. ఇక శబరిమల తీర్పుపై దృష్టి
ఎన్నో దశాబ్దాలుగా కొనసాగుతూ వచ్చిన వివాదాస్పద అయోధ్య భూ వివాదం కేసును సుప్రీంకోర్టు ఓ కొలిక్కి తెచ్చింది. తాజాగా వెలువరించిన తీర్పు అన్ని వర్గాల ప్రజలు స్వాగతించారు. దీంతో ఎన్నో దశాబ్దాలుగా కొనసాగుతూ వచ్చిన అయోధ్య భూ వివాద కేసు ముగిసింది. ఇపుడు శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై కూడా సుప్రీంకోర్టు తుది తీర్పును వెలువరించనుంది.
ముఖ్యంగా కేరళలోని శబరిమల ఆలయంలో అన్ని వయసుల మహిళల ప్రవేశానికి సంబంధించి అనుమతిని సవాలు చేస్తూ పలు రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఇవి పెండింగులో ఉన్నాయి. 2018 సెప్టెంబరులో సుప్రీంకోర్టు ధర్మాసనం ఇఛ్చిన తీర్పు మీద ఈ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ కేసులో కూడా సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించనుంది. ఈ నెల 17వ తేదీన చీఫ్ జస్టీస్ రంజన్ గగోయ్ పదవీ విరమణ చేయనున్నారు. ఈ లోపు ఆయన పలు కీలక కేసులపై తీర్పులు వెలువరించేందుకు సిద్ధంగా ఉన్నారు.
అలాంటివాటిలో ఒకటి శబరిమల పుణ్యక్షేత్రంలోకి మహిళల ప్రవేశంపై తుది తీర్పు, రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు కేసు, ఉరి తీస్తారేమోన్న భయంతో మ్యాన్మార్‌ను వదిలి వఛ్చిన సుమారు 40 వేల మంది రోహింగ్యాల భవితవ్యంపై నిర్ణయం, గతంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని మోడీని ఉద్దేశించి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ 'చౌకీదార్ చోర్ హై' అంటూ చేసిన ఆరోపణ తాలూకు కోర్టు ధిక్కరణ కేసుపై కూడా సుప్రీంకోర్టు తుదితీర్పును వెలువరించనుంది. ఈ కేసులన్నింటిపీ ఈ నెల 13 నుంచి 15వ తేదీలోపు తుది తీర్పును వెలువరించే అవకాశం ఉంది.