మంగళవారం, 28 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్

అయోధ్య తీర్పు కోసం ఎదురు చూపులు...

అయోధ్యలో రామజన్మభూమి - బాబ్రీ మసీదు వివాదం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వందేండ్లకుపైగా కొనసాగుతున్న ఈ వివాదంపై తుది తీర్పు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు సిద్ధమైంది. సీజేఐ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసులో 46 రోజులపాటు రోజువారీ విచారణ జరిపింది. 
 
అన్ని పక్షాల వాదలను విన్న అనంతరం.. తీర్పును రిజర్వ్‌లో ఉంచుతున్నట్టు గత నెల 16న ప్రకటించింది. ధర్మాసం ఏకగ్రీవంగా నిర్ణయాన్ని వెల్లడిస్తుందా? లేదా 4-1, 3-2 తేడాతో నిర్ణయం వెలువరిస్తుందా? అని ఆసక్తి నెలకొంది. ఈ తీర్పు ఎవరికి అనుకూలంగా ఉన్నా సామాజికంగా తీవ్ర ప్రభావం చూపనున్నది. 
 
ముఖ్యంగా వచ్చే తరాలపై తీర్పు ప్రభావం ఉంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో హిందూ, ముస్లిం సంస్థల పెద్దలు తీర్పు ఎవరికి అనుకూలంగా వచ్చినా సంయమనం పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. అదేసమయంలో తీర్పు వచ్చిన వెంటనే నిర్మాణాలు ప్రారంభించకుండా.. కొన్నాళ్లపాటు ఆ స్థలాన్ని ఖాళీగా ఉంచాలని కోరుతున్నారు. మొత్తంమీద అయోధ్యపై సుప్రీంకోర్టు ఇచ్చే తుది తీర్పు పట్ల దేశం యావత్తూ ఉత్కంఠతగా ఎదురు చూస్తోంది.