బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 25 మార్చి 2021 (16:18 IST)

భార్యకు చేపల కూర వండి పెట్టి ఖతం చేసిన భర్త.. ఎక్కడ.. ఎందుకు..?

మానవీయ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. భార్యాభర్తల ఆప్యాయతలు కనుమరుగవుతున్నాయి. తాజాగా ఓ దుర్మార్గుడు భార్యను చేపల కూర వండిపెట్టి ఖతం చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి వరుణ్ అరోరా (37) దారుణానికి ఒడిగట్టాడు. చేపల కర్రీలో థాలియం (విష పదార్దం) కలిపి భార్య కుటుంబంపై హత్యాయత్నం చేశాడు. 
 
తన చేతికి మట్టి అంటకుండా పగ తీర్చుకునేందుకు విష ప్రయోగాన్ని ఎంచుకున్నాడు. థాలియం అనే కెమికల్ కలిపి ఫిష్ కర్రీ చేశాడు. థాలియం స్లో పాయిజన్ లా పని చేస్తుంది. భార్యకు ఆమె కుటుంబసభ్యులు భార్య తల్లిదండ్రులు, సోదరికి పెట్టాడు. 
 
చేపల కూరలో కలిసిన థాలియం మూడు నిండు ప్రాణాలను హరించింది. ఫిబ్రవరిలో వరుణ్ భార్య, ఆమె సోదరి చనిపోగా, గంగారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మార్చి 21న వరుణ్ అరోరా అత్త మరణించారు. ఈ దారుణంపై పోలీసులు విచారణ చేయగా, సంచలన విషయాలు వెలుగుచూశాయి.
 
ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్‌లో వరుణ్ అరోరా నివాసం ఉంటాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన అరోరాకు భార్య, ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. హాయిగా సాగిపోతున్న సంసారం, సంతోషకరమైన జీవితం. కానీ, ఆరేళ్ల క్రితం జరిగిన ఘటన వరుణ్‌ని పీడ కలలా వెంటాడింది. ఆ బాధకు భార్య, ఆమె కుటుంబమే కారణం అన్నది వరుణ్ అరోరా ఉద్దేశం. ఆరేళ్లు అయినా వారి మీద అతడికి కోపం ఏమాత్రం తగ్గలేదు. పైగా కసి పెరిగింది. 
 
ఎలాగైనా కక్ష తీర్చుకోవాలని అనుకున్నాడు. తనకు బాధ కలిగించేలా ప్రవర్తించిన భార్యను ఆమె తల్లిదండ్రులను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. కానీ, తానే హంతకుడు అనే విషయం బయటపడకుండా అత్యంత తెలివిగా వ్యవహరించాడు.
 
ఎలా చంపాలి అని ఆలోచిస్తుండగా, అతడికి ఇరాన్ దివంగత అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన ఓ పుస్తకం కనిపించింది. ప్రత్యర్థులపై థాలియం అనే కెమికల్ ఉపయోగించి మూడో కంటికి తెలియకుండా సద్దాం హుస్సేన్, అతడి ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు.. ప్రత్యర్థులను హతమార్చిన విషయం ఆ వ్యాపారిని ఆకర్షించింది. అంతే, దాని ఆధారంగా ప్రణాళిక రచించాడు. కరోనా కాలం అతడికి కలిసొచ్చింది. ప్రమాదకరమైన థాలియంను ఆన్ లైన్ లో ఆర్డర్ చేశాడు. హోమియోపతి డాక్టర్ అయిన తన మామతో కలిసి తాను కరోనా మందు తయారు చేస్తున్నానని అబద్దం చెప్పి ఆన్ లైన్‌లో థాలియంను ఆర్డర్ చేశాడు.
 
థాలియంతో చేపల కూర వండాడు. ఆ కర్రీని తాను తినలేదు, పిల్లలకూ పెట్టలేదు. భార్య, ఆమె చెల్లి, ఆమె తల్లిదండ్రులకు మాత్రమే వడ్డించాడు. జనవరిలో ఈ ఘటన జరిగింది. భర్త ప్రేమగా పెట్టడంతో భార్య ఆ కూర తింది. థాలియం స్లో పాయిజన్ లా పని చేసింది. ఆ కూర తిన్న భార్య కోమాలోకి వెళ్లింది. ఆ తర్వాత ఫిబ్రవరిలో ఆమె చనిపోయింది. కొన్ని రోజుల క్రితం భార్య తల్లి కూడా మరణించింది.
 
కుటుంబాన్ని చంపాలని వరుణ్ అరోరా నిర్ణయం తీసుకోవడానికి వెనుక గల కారణం తెలుసుకుని పోలీసులు సైతం విస్తుపోయారు. ఆరేళ్ల క్రితం వరుణ్ తండ్రి చనిపోయాడు. అదే సమయంలో వరుణ్ భార్య గర్భం దాల్చింది. తన తండ్రి మళ్లీ కొడుకు రూపంలో తనకు పుట్టబోతున్నాడని వరుణ్ నమ్మాడు. కానీ, గర్భంలో సమస్యలు తలెత్తడంతో వరుణ్ భార్య అబార్షన్ చేయించుకున్నారు. 
 
ఆ అబార్షన్ వరుణ్‌కు ఇష్టం లేదు. భార్య, ఆమె తల్లిదండ్రులు తన మాట వినలేదనే కోపం ఏళ్లు గడిచినా అతడిని వెంటాడింది. ఇద్దరు కవల పిల్లలు పుట్టిన తర్వాత కూడా కోపం చల్లారలేదు. విచక్షణ మరిచి ఘాతుకానికి ఒడిగట్టాడు. మంగళవారం రాత్రి పోలీసులు వరుణ్‌ని అరెస్ట్ చేశారు.
 
వరుణ్ అరోరా మామ దేవేంద్ర మోహన్ శర్మ(62) ఫిర్యాదుతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. వరుణ్ అరోరా భార్య సోదరి రక్తాన్ని సేకరించి ల్యాబ్‌కి పంపారు. అందులోనూ థాలియం ఉన్నట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో పోలీసులు తమ ముందుకు విచారణకు రావాలని అరోరాని పిలిచారు. కానీ అతను రాలేదు. దీంతో పోలీసులు మంగళవారం రాత్రి వరుణ్ అరోరా ఇంటిపై దాడి చేశారు. అతడి ల్యాప్ ట్యాప్ స్వాధీనం చేసుకున్నారు. ల్యాప్ ట్యాప్‌ని ఓపెన్ చేసి చూడగా, థాలియంకు సంబంధించి అతడు సమాచారం సేకరించినట్టు బ్రౌజింగ్ హిస్టరీ ద్వారా తెలుసుకున్నారు.