దొంగతనానికి వెళ్లి చేపల కూర తిని.. హాయిగా నిద్రపోయాడు.. చివరికి?
దొంగతానికి వెళ్లి చేపల కూర తిని మస్తుగా నిద్రపోయిన ఓ దొంగను జనాలు ఉతికేశారు. చోరీకి వెళ్లి.. ఆకలేసిందో ఏమో కానీ ఆ దొంగ ఆ ఇంట్లో వండిపెట్టిన చేపలకూర తిని హాయిగా నిద్రపోయాడు. అంతే.. జనాలకు చిక్కాడు. ఈ ఘటన తమిళనాడులోని కన్యాకుమారిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కన్యాకుమారి జిల్లాలో సతీష్ అనే యువకుడు ఓ ఇంట్లో దొంగతనం చేయటానికి వచ్చాడు.
ఏమేమీ నొక్కేద్దామా అనుకుంటూ ఇల్లంతా కలియతిరిగాడు. బంగారంగానీ.. విలువైన వస్తువులు ఏమీ కనిపించలేదు. ఏమీ దొరక్కపోవడంతో.. వంటింట్లోంచి ఘుమఘుమలాడే చేపల పులుసు కూర వాసన వచ్చింది. పాపం.. నోరూరింది. ఆగలేకపోయాడు. కూర రుచిగా వుండటంతో కడుపు నిండా లాగించేశాడు. డాబా మీదకెళ్లి హాయిగా నిద్రపోయాడు.
ఇంతలో ఇంటి యజమాని నిద్రలేచాడు. ఇంట్లో చిందరవందరగా ఉన్న వస్తువులు చూసి దొంగతనం జరిగిందని భయపడిపోయాడు. ఇరుగు పొరుగు వారికి చెప్పాడు. దొంగ పారిపోయాడనుకుని సీసీటీవీ కెమేరాల పుటేజ్‌ను పరిశీలించారు.
చేపల కూరంతా తినేసి మేడమీదనుంచి దూకి పారిపోయి ఉంటాడని అనుకుంటూ.. మేడపైకి వెళ్లారు. అక్కడే నిద్రపోతున్న దొంగను చూసి షాకయ్యారు. ఆపై అతడ్ని లేపి.. చితకబాదారు. ఆపై పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.