బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 20 నవంబరు 2020 (12:44 IST)

తమిళనాడులో ఓ మహిళా ఎమ్మెల్యే నిద్రమాత్రలు మింగేసింది...

Poongothai Aladi Aruna
తమిళనాడులో ఓ మహిళా ఎమ్మెల్యే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన తమిళనాడు రాజకీయాల్లో కలకలం రేపింది. తమిళనాడు రాజకీయాల్లో అరుణ ఇటీవల హాట్ టాపిక్‌గా నిలిచారు. ఇకపోతే అలాది అరుణ వృత్తిరీత్యా గైనకాలజిస్ట్. గతంలో ఆమె మంత్రిగానూ పనిచేశారు.

కరుణానిధి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. 2006 నుంచి 2008 వరకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. విద్యార్థులకు మధ్యాహ్నం భోజనానికి సంబంధించి గుడ్ల పథకం తీసుకొచ్చిన ఘనత ఈమెదే. అనంతరం 2009లో రాష్ట్ర ఐటీ మంత్రిగానూ సేవలందించారు.
 
ఈ నేపథ్యంలో డీఎంకే మహిళా ఎమ్మెల్యే పూన్‌గొతాయ్ అలాది అరుణ గురువారం ఆత్మహత్యాయత్నం చేశారు. మోతాదుకు మించి నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. తిరునల్వేలిలోని షిఫా ఆస్పత్రిలో అలాది అరుణ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. అపస్మారక స్థితిలో అరుణను ఆస్పత్రికి తీసుకొచ్చారని.. ఐసీయూలో చికిత్స కొనసాగుతోందని డాక్టర్లు తెలిపారు. చికిత్సకు ఆమె స్పందిస్తున్నారని వైద్యులు తెలిపారు.
 
డీఎంకే పార్టీలో విభేదాల కారణంగా ఎమ్మెల్యే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. బుధవారం కడయం ప్రాంతంలో జరిగిన డీఎంకే బూత్ కమిటీ మీటింగ్‌కు ఆమె హాజరయ్యారు. ఆ సమయంలో కొందరు కార్యకర్తలు అరుణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అసభ్య పదజాలంతో దూషించడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. పార్టీ నాయకులు నచ్చజెప్పడంతో మళ్లీ వచ్చి ప్రసంగించారు. ప్రసంగ సమయంలో మైక్‌ను కట్ చేయడంతో మనస్తాపానికి గురయ్యారని తెలుస్తోంది. మరోవైపు డీఎంకే పార్టీలోనే ఉన్న తన సోదరుడితోనూ అరుణకు విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది.