మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 10 నవంబరు 2020 (08:54 IST)

కంచీలో దారుణం.. విలేకరిని కొట్టి చంపేసిన డ్రగ్ డీలర్లు!!

ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఒకటైన కాంచీపురంలో దారుణం జరిగింది. ఈ జిల్లాలోని డ్రగ్ మాఫియా రెచ్చిపోయింది. తమ కార్యకలాపాలకు అడ్డుపడటమే కాకుండా తమ గుట్టును బహిర్గతం చేసినందుకు ఓ టీవీ జర్నలిస్టును కొట్టి చంపేశారు. తనకు ప్రాణహాని ఉందని ఇటీవలే ఆ జర్నలిస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. అయినా, అతని ప్రాణాలు పోవడంతో జర్నలిస్టు, ప్రజా సంఘాలు పోలీసుల తీరుపై మండిపడుతున్నాయి.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కాంచీపురం జిల్లాకు చెందిన ఇజ్రాయెల్ మోజేస్ (27) అనే యువకుడు ఓ తమిళ టీవీ చానెల్‌లో జర్నలిస్టుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం సాయంత్రం సోమంగళం పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఓ ఘటనలో మోజేస్‌ను దారుణంగా కొట్టి చంపారు. 
 
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, ఈ కేసులో నలుగురిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. అక్రమ భూ దందాలు, డ్రగ్స్‌ను అమ్ముతున్న కొందరు ఈ దారుణానికి పాల్పడ్డారని, స్థానిక చెరువు వద్ద ఈ ఘటన జరిగిందని అన్నారు. అయితే, ఇటీవలి కాలంలో మోజేస్, డ్రగ్స్ దందాపై ఎటువంటి వార్తలనూ టెలికాస్ట్ చేయించలేదని పోలీసు వర్గాలు అంటున్నాయి. 
 
బాధితుడి తండ్రి గంగరాజ్ స్పందిస్తూ, తన ప్రాణాలకు ముప్పు ఉందని మోజేస్ పోలీసులకు సమాచారాన్ని అందించినా, వారు పట్టించుకోలేదని ఆరోపించారు. గంగరాజ్ ఆరోపణలను ఖండించిన పోలీసు అధికారులు, మోజేస్ నుంచి అటువంటి ఫిర్యాదు తమకు రాలేదని స్పష్టం చేశారు. కేసును విచారిస్తున్నామని, దీని వెనుక ఎవరున్నా అరెస్ట్ చేస్తామని తెలిపారు.