'లీక్' ఘటనలు ఎప్పుడెక్కడ జరిగాయో తెలుసా?
విశాఖపట్టణంలో జరిగిన స్టెరిన్ గ్యాస్ లీక్ ప్రమాదం వల్ల 12 మంది మృతి చెందారు. వందలాది మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇలాంటి గ్యాస్ లీకేజీ ఘటనలు ప్రపంచవ్యాప్తంగా చాలా చోటుచేసుకున్నాయి. కొన్ని కీలక సంఘటనల వివరాలు…
▪️ మార్చి 18, 1937 : టెక్సాస్ స్కూల్ సమీపంలో ఉన్న నేచురల్ గ్యాస్ పేలుడు వల్ల సుమారు 300 మంది విద్యార్థులు చనిపోయారు. ఆయిల్, నేచురల్ గ్యాస్ ఫీల్డ్ మధ్యలో ఉన్న న్యూ లండన్ స్కూల్‌లో ఈ దారుణం జరిగింది.
▪️ భోపాల్ గ్యాస్ విషాదం(1984): భోపాల్ పారిశ్రామిక వాడలో ఈ ప్రమాదం జరిగింది. 20వ శతాబ్ధంలోనే ఇది అత్యంత దారుణమైన ఘటన. సుమారు 40 టన్నుల మిథైల్ ఐసోసైనేట్ గ్యాస్ లీక్ కావడం వల్ల సుమారు నాలుగు వేల మంది చనిపోయారు. డిసెంబర్ 3వ తేదీన ఈ ఘటన జరిగింది. దాదాపు ఆరు లక్షల మందికి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
▪️ పైపర్ ఆల్ఫా డిజాస్టర్(1988): ఆయిల్ రిగ్‌లో జరిగిన ప్రమాదం ఇది. సుమారు 167 మంది మరణించారు. జూలై 6, 1988లో ఈ ఘటన జరిగింది. ఉత్తర సముద్రంలో ఉన్న పైపర్ ఆల్ఫా ఆయిల్ రిగ్‌లో ఈ ప్రమాదం జరిగింది.
▪️ ఉఫా ట్రైన్ డిజాస్టర్ (1989): సోవియేట్ రష్యాలో జరిగిన రైలు ప్రమాదం ఇది. రైల్వే లైను వద్ద ఉన్న పైప్‌లైన్ పేలడంతో ప్రమాదం జరిగింది. దాని వల్ల 575 మంది మరణించారు. ఈ ఘటన జూన్ 4, 1989లో జరిగింది. రెండు రైళ్లు దగ్గరగా వెల్లడం వల్ల వచ్చిన స్పార్క్‌తో పైప్‌లైన్‌కు మంటలు అంటుకున్నాయి.
▪️ గుడాలజరా గ్యాస్ బ్లాస్ట్(1992): మెక్సికోలోని గుడాలజరా నగరంలో పెట్రోల్ .. సీవేజ్‌లోకి లీక్ కావడం వల్ల 12 చోట్లు పేలుళ్లు జరిగాయి. ఈ ప్రమాదం వల్ల సుమారు 200 మంది మరణించారు. ఏప్రిల్ 22న ఈ ఘటన జరిగింది. 8 కిలోమీటర్ల మేర వీధులన్నీ ధ్వంసం అయ్యాయి.
▪️ బీజింగ్ గ్యాస్ లీక్ (2008): బీజింగ్‌లో జరిగిన గ్యాస్ లీక్ ఘటనలో 17 మంది చనిపోయారు. గంగ్లూ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీలో ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో కంపెనీలో సుమారు ఏడు వేల మంది కార్మికులు ఉన్నారు.
▪️ చైనా గనిలో గ్యాస్ లీక్(నవంబర్, 2011): చైనా గనిలో 20 మంది కార్మికులు మృతిచెందారు. సుమారు 43 మంది కార్మికులు ఈ ప్రమాదంలో చిక్కుకున్నారు.
▪️ కావోషింగ్ గ్యాస్ పేలుడు(2014): తైవాన్‌లోని కావోషింగ్ సిటీలో పేలుడు జరిగింది. ఈ ఘటనలో 25 మంది మృతిచెందారు. జూలై 31, 2014లో ఈ ప్రమాదం జరిగింది. పారిశ్రామికవాడలోని ప్రొపేన్ గ్యాస్ లీక్ వల్ల ఈ ఘటన జరిగింది.
▪️ చైనా గ్యాస్ లీక్(మే 2017): చైనాలోని హునాన్ ప్రావిన్సులోని బొగ్గు గనిలో గ్యాస్ లీక్ వల్ల 18 మంది మృతిచెందారు.
▪️ ఇరాన్ గ్యాస్ లీక్(ఆగస్టు 2017): క‌్లోరిన్ గ్యాస్ లీకేజీ వల్ల సుమారు 400 మంది అస్వస్థతకు గురయ్యారు. డిజ్‌ఫుల్ సిటీలో ఈ ప్రమాదం జరిగింది. రిజర్వాయర్ల నుంచి గ్యాస్ లీక్ కావడం వల్ల ఈ ఘటన జరిగింది.