సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 7 అక్టోబరు 2022 (10:32 IST)

గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి రూ.20 కోట్లు విరాళంగా ఇచ్చిన వైద్యురాలు

Dr Uma
Dr Uma
జీవితాంతం శ్రమించి సంపాదించిన యావదాస్తిని ఓ మహిళా వైద్యురాలు తృణప్రాయంగా భావించారు. అంతే.. ఆ మరుక్షణమే ఆమె రూ.20 కోట్ల విలువ చేసే యావదాస్తిని గుంటూరు సమగ్ర ప్రభుత్వ ఆస్పత్రికి దానం చేశారు. ఆమె భర్త మూడేళ్ల క్రితం చనిపోవడం, ఆమెకు వారసులు లేకపోవడంతో ఆ మహిళా వైద్యురాలు ఈ నిర్ణయం తీసుకుంది. ఆమె పేరు డాక్టర్ ఉమ. 
 
గుంటూరు ప్రభుత్వం ఆస్పత్రిలో కొత్తగా నిర్మిస్తున్న మాతాశిశు సంక్షేమ భవనానికి గవిని ఉమ తన రూ.20 కోట్ల ఆస్తిని విరాళంగా ఇచ్చారు. గుంటూరు జిల్లాకు చెందిన డాక్టర్ ఉమ గత 1965లో గుంటూరు వైద్య కాలేజీలోనే వైద్య విద్యను అభ్యసించారు. ఆ తర్వాత ఉన్నత విద్యను పూర్తి చేసి అమెరికా వెళ్లి అక్కడే స్పెషలిస్టు వైద్యురాలిగా స్థిరపడ్డారు. అక్కడ ఇమ్యునాలజిస్ట్, ఎలర్జీ స్పెషలిస్టుగా పని చేస్తున్నారు. 
 
గత నెలలో డల్లాస్‌లో జరిగిన గుంటూరు వైద్య కాలేజీ పూర్వ విద్యార్థుల సంఘం, ఉత్తర అమెరికా (జింకానా) 17వ రీ యూనియన్ సమావేశాలకు వెళ్ళారు. ఈ వేదికపైనే తాను వైద్య విద్యను అభ్యసించిన జీజీహెచ్‌కు భారీ విరాళం ఇవ్వాలన్న నిర్ణయాన్ని ఆమె వెల్లడించారు. ఉమ తన తరపున, తన భర్త తరపున వచ్చిన యావదాస్తిని రాసిచ్చేశారు. 
 
మరోవైపు డాక్టర్ ఉమ 2008లో 'జింకానా' అధ్యక్షురాలిగా సేవలందించారు. అంతేకాదు ఈ విరాళంతో నిర్మాణం అవుతున్న జీజీహెచ్‌లోని ఎంసీహెచ్‌ బ్లాక్‌కు ఆమె పేరును పెడతామని జింకానా సభ్యులు అన్నారు. ఉమ ఈ ప్రతిపాదనను తోసిపుచ్చారు. 
 
అయితే, ఆమె భర్త డాక్టర్‌ కానూరి రామచంద్రరావు పేరును ఈ బ్లాక్‌ను పెట్టాలని నిర్ణయించారు. డాక్టర్‌ కానూరి రామచంద్రరావు కర్ణాటకలోని గుల్బర్గాలో మెడిసిన్‌ చేసి, ఎనస్థటిస్ట్‌గా సేవలు అందించారు. మూడేళ్ల కిందట ఆయన కన్నుమూశారు.
 
డాక్టర్ ఉమ తన ఆస్తిని జీజీహెచ్‌కు ఇవ్వడం మాత్రమే కాదు.. ఆమె స్ఫూర్తితో మిగిలిన డాక్టర్లు కూడా తమకు తోచిన విధంగా సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. పూర్వ విద్యార్థులు కూడా విరాళాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు. మొత్తం మీద డాక్టర్ ఉమ నిర్ణయంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. గొప్ప నిర్ణయం అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.