శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

వలస పక్షుల వల్లే బర్డ్‌ఫ్లూ : కేంద్ర మంత్రి గిరిరాజ్

దేశంలో బర్డ్‌ఫ్లూ వైరస్ కలకలం రేగింది. దీనిపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ స్పందించారు. విదేశాల నుంచి భారత్ వచ్చే వలస పక్షుల వల్లే బర్డ్ ఫ్లూ మనదేశంలో మళ్లీ కనిపిస్తోందన్నారు. బర్డ్ ఫ్లూ కేసులు ప్రపంచం మొత్తం ఉన్నాయన్నారు. 
 
అయితే గత సెప్టెంబరులో భారత్‌ను బర్డ్ ఫ్లూ రహిత దేశంగా ప్రకటించామని, శీతాకాలం నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలంటూ అక్టోబరులో రాష్ట్రాలకు సలహా ఇచ్చామని గిరిరాజ్ సింగ్ వెల్లడించారు. 
 
అయితే, ఇప్పుడు భారత్‌లో మళ్లీ బర్డ్ ఫ్లూ కేసులు వస్తుండడానికి కారణం విదేశాల నుంచి వచ్చే వలస పక్షులేనని తెలిపారు. దేశంలో వలస పక్షులకు ఆవాసంగా ఉండే ప్రాంతాల్లోనే బర్డ్ ఫ్లూ కేసులు అధికంగా వస్తున్నాయని తెలిపారు.
 
విజృంభిస్తున్న కొత్త వైరస్
 
దేశాన్ని మరో వైరస్ వణికిస్తోంది. ఈ వైరస్ మనుషుల్లో పెద్దగా ప్రభావం చూపక పోయినప్పటికీ.. కోళ్ళను చంపేస్తోంది. గత పది రోజుల్లో ఏకంగా నాలుగు లక్షల కోళ్లు చనిపోయాయి. అత్యంత ప్రమాదకరమైన బర్డ్‌ఫ్లూ వైరస్‌ (హెచ్‌5ఎన్‌8) దేశవ్యాప్తంగా శరవేగంగా విస్తరిస్తున్నది. కాశ్మీర్‌ మొదలు కేరళ వరకు వందల సంఖ్యలో వలస పక్షులు ఈ వైరస్‌ బారిన పడి మరణిస్తుండటంతో కేంద్రప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీచేసింది. 
 
హర్యానా, జమ్మూకాశ్మీర్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, కేరళ రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ వైరస్‌ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నది. హర్యానాలో పంచకుల జిల్లాలోని కోళ్ల ఫారాల్లో గత 10 రోజుల్లోనే ఏకంగా 4 లక్షల కోళ్లు మృతిచెందాయి. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూతో వందలసంఖ్యలో కాకులు మరణించాయి. 
 
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో గత నెల 29న దలై కాలేజీ క్యాంపస్‌లో బర్డ్‌ఫ్లూతో ఒకేరోజు 50 కాకులు మరణించాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు ఈ వైరస్‌తో 155 కాకులు చనిపోయాయని.. ఇతర పక్షల్లో వైరస్‌ను గుర్తించలేదని మధ్యప్రదేశ్‌ వెటర్నరీ విభాగం డిఫ్యూటీ డైరెక్టర్‌ ప్రమోద్‌ శర్మ తెలిపారు. రాజస్థాన్‌లోని కోటా, బారన్‌ ప్రాంతాల్లో వలస పక్షుల్లోనూ బర్డ్‌ఫ్లూను గుర్తించారు. 
 
ఇకపోతే, కేరళలో బర్డ్‌ఫ్లూతో 1,700 బాతులు మరణించటంతో ఆలప్పుళ, కొట్టాయం ప్రాంతాల్లో పెంపుడు కోళ్లు, బాతులన్నింటినీ చంపేస్తున్నారు. ముఖ్యంగా వైరస్‌ వెలుగుచూసిన ప్రాంతానికి సమీపంలో ఉన్న నెడుముడి, తకఝై, పల్లిప్పాడ్‌, కరువట్ట గ్రామాల్లో పక్షులన్నింటినీ చంపుతున్నారు. వైరస్‌ వ్యాపించిన ప్రాంతంలో మొత్తం 40 వేల పెంపుడు కోళ్లు, బాతులను చంపాలని నిర్ణయించినట్టు తెలిపారు. 
 
అయితే, కేరళ సరిహద్దులకు సమీపంలో ఉన్న కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు బర్డ్‌ఫ్లూ భయంతో వణుకుతున్నాయి. కోళ్ల ఫారాలు, పక్షులు పెంపుడు కేంద్రాల్లోకి వైరస్‌ ప్రవేశించకుండా పటిష్ఠ చర్యలు చేపడుతున్నట్టు తమిళనాడు ఆరోగ్యశాఖ కార్యదర్శి జే రాధాకృష్ణన్‌ తెలిపారు. 
 
కేరళ, తమిళనాడు రాష్ర్టాల సరిహద్దుల్లోని జిల్లాల యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి కే సుధాకర్‌ మంగళవారం ఆదేశించారు. మధ్యప్రదేశ్‌తో సరిహద్దు ఉన్న మహారాష్ట్ర కూడా బర్డ్‌ఫ్లూపై అప్రమత్తమైంది.
 
ఇలాంటి పరిస్థితుల్లో కొంతకాలం కోళ్లు, బాతుల మాంసం తినొద్దని కేరళ, మధ్యప్రదేశ్‌ అధికారులు ప్రజలకు సూచించారు. కేరళలోని ఆలప్పుళ జిల్లాలో కోళ్లు ఇతర పక్షుల మాంసం విక్రయాలను నిషేధించారు.