500 కోసం వెళ్లి... 10 వేలు జరిమానా కట్టారు... ఎలానో తెలిస్తే ఆశ్చర్యపోతారు
కరువు కాలంలో నాలుగు రూకలు వస్తాయనుకుంటే.. అసలుకే ఎసరొచ్చిపడింది. లాక్‌డౌన్ నేపథ్యంలో జన్‌ధన్ ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసిన రూ. 500 తీసుకునేందుకు వెళ్లిన మహిళలను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లాలో జరిగింది.
ప్రభుత్వం జమ చేసిన రూ. 500 తీసుకునేందుకు వెళ్లిన మహిళలు బ్యాంకు బయట క్యూ కట్టారు. విషయం తెలిసిన పోలీసులు బ్యాంకు వద్దకు చేరుకుని భౌతిక దూరం పాటించాలని కోరారు.
అయినా వారు పట్టించుకోకపోవడంతో 39 మంది మహిళలను అదుపులోకి తీసుకుని జీపెక్కించారు. మహిళలకు సామాజిక దూరం పాఠాలు చెప్పిన పోలీసులు మాత్రం అందరినీ ఒకే జీపులోకి ఎక్కించి భౌతిక దూరం పాటించాలన్న విషయాన్ని మరిచారు. ఇది తీవ్ర విమర్శలకు దారితీసింది.
మహిళలపై సెక్షన్ 151 సెక్షన్ కింద కేసులు నమోదు చేసిన పోలీసులు అందరినీ జైలుకు తరలించారు. విషయం తెలిసిన వారి భర్తలు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. రూ. 10 వేల చొప్పున జరిమానా చెల్లించి కోర్టు నుంచి బెయిలు తీసుకున్నారు.