సింహాన్ని ఢీకొట్టిన గూడ్స్ రైలు.. ప్రాణాలకు ప్రమాదం లేదు కానీ..?
గుజరాత్‌లోని అమ్రేలీ జిల్లా రాజులా పట్టణ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఓ గూడ్స్ రైలు సింహాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సింహం తీవ్రంగా గాయపడింది. ట్రాకర్స్ ద్వారా ప్రమాద సమాచారం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకుని గాయపడ్డ సింహాన్ని బాబర్‌కోట్ రెస్క్యూ సెంటర్‌కు తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం తదుపరి ట్రీట్‌మెంట్ కోసం జునాగఢ్‌లోని సక్కర్‌బాగ్ జంతుప్రదర్శనశాలకు తరలించారు.
ప్రమాదంలో సింహం తీవ్రంగా గాయపడిందని, అయితే దాని ప్రాణాలకు ప్రమాదమేమీ ఉండకపోవచ్చని, అది బతుకుతుందని ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ డీటీ వాసవద చెప్పారు. సింహం రాజులా అటవీ ప్రాంతానికి పిపవావ్ ఓడరేవుకు మధ్య సంచరిస్తుండగా ప్రమాదానికి గురైందని తెలిపారు.
అటవీ ప్రాంతాల గుండా వెళ్లే రైళ్ల వేగాన్ని పరిమితం చేయాలని ప్రభుత్వం గతంలో రైల్వే అధికారులను కోరింది. 2018లో, ఆరు సింహాలు రైల్వే ట్రాక్‌ల వెంట నడుస్తున్నప్పుడు, అమ్రేలీకి చెందిన సావర్‌కుండ్ల తాలూకాలోని పిపావవ్-బొటాడ్ గూడ్స్ రైలులో చిక్కుకున్నాయి.