ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 24 ఆగస్టు 2020 (19:42 IST)

కరోనా వైరస్ బారినపడిన మరో బీజేపీ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రి

దేశంలో మరో రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి కరోనా వైరస్ బారినపడ్డారు. ఆయన పేరు మనోహర్ లాల్ ఖట్టర్. బీజేపీ పాలిత రాష్ట్రమైన హర్యానా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఇప్పటికే బీజేపీకి చెందిన ఇద్దరు ముఖ్యమంత్రులైన శివరాజ్ సింగ్ చౌహాన్ (మధ్యప్రదేశ్), యడ్యూరప్ప (కర్నాటక)లు ఈ వైరస్ బారినపడి కోలుకున్న విషయం తెల్సిందే.
 
ఈ నేపథ్యంలో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. తనకు పాజిటివ్‌గా తేలిందన్న విషయాన్ని ఆయన ట్వీట్ ద్వారా సమాచారమిచ్చారు. "ఈ రోజు కరోనా నిర్ధారిత పరీక్షలు చేయించాను. రిపోర్ట్ పాజిటివ్‌గా వచ్చింది. నన్ను సంప్రదించిన వారందరూ సెల్ఫ్ క్వారంటైన్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను" అని ట్విట్టర్లో ఖట్టర్ తెలిపారు.
 
కాగా, దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. ఫలితంగా దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ ఎక్కువైపోతున్నాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా రోగుల సంఖ్య 31,24,391కు పెరిగింది. వీరిలో 23,52,507 మంది నయంకాగా, 57,869 మంది మరణించారు. ప్రస్తుతం 7,13,461 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. 
 
మరోవైపు, దేశంలో పరీక్షల సంఖ్య క్రమంగా తగ్గుతున్నది. ఆగస్టు 21న ప్రభుత్వం 10 లక్షలకు పైగా పరీక్షలు చేసి కొత్త రికార్డు సృష్టించింది. అప్పటి నుంచి ఇది నిరంతరంగా తగ్గుతూ వస్తున్నది. ఆగస్టు 22న 8 లక్షల పరీక్షలు జరగ్గా.. ఆగస్టు 23న 6 లక్షల మందికి పరీక్షలు నిర్వహించారు. మూడు రోజుల్లో 4 లక్షల టెస్టులు నమోదయ్యాయి.
 
త్వరలో మిషన్ కొవిడ్ భద్రతా పథకం 
మరోవైపు, దేశంలో కరోనా వ్యాక్సిన్ కోసం మిషన్ కొవిడ్ భద్రతా పథకాన్ని ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. బయోటెక్నాలజీ విభాగం తన ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపినట్లు తెలిసింది. ఈ మిషన్ యొక్క లక్ష్యం దేశంలో కనీసం 6 కరోనా వ్యాక్సిన్లను తయారు చేసి లైసెన్స్ ఇవ్వడం, అలాగే వాటిని మార్కెట్లో ప్రవేశపెట్టడం. అయితే, ఇది ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు.