శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 7 ఫిబ్రవరి 2019 (09:18 IST)

నీ బిడ్డను బుట్టలో వేసుకున్నా.. ఏం చేస్తావ్.. మధులిక తల్లికి ప్రియుడు బెదిరింపు

హైదరాబాద్ నగరంలో ప్రేమోన్మాథం బుసలు కొట్టింది. ప్రేమించలేదన్న అక్కసుతో 17 యేళ్ల మధులిక అనే బాలికపై 19 యేళ్ల వయుసున్న ప్రేమోన్మాది చిట్టూరి భరత్ కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మధులిక ఇపుడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. అత్యంత పాశవికంగా జరిగిన ఈ దాడికి సంబంధించి ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. 
 
హైదరాబాద్, కాచిగూడ సమీపంలోని సత్యానగర్‌కు చెందిన రాములు, ఉదయ అనే దంపతుల రెండో కుమార్తె మధులిక. స్థానికంగా ఉండే ఓ కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అయితే, మధులిక ఇంటి సమీపంలో ఉండే 19 యేళ్ళ వయసున్న భరత్.. ప్రేమ పేరుతో మధులికను గత రెండేళ్లుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ప్రేమను పలుమార్లు తిరస్కరించినా అతను మాత్రం వదిలిపెట్టలేదు. 
 
ఈ క్రమంలో వేధింపులు ఎక్కువకావడంతో తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో భరత్‌ను మధులిక తండ్రి రాములు మందలించాడు. ఆ తర్వాత రోజు నుంచి ఆమె వెంటపడటం మరింత ఎక్కువైంది. ఈ క్రమంలో మధులిక తల్లికి ఫోన్ చేసి.. నీ బిడ్డను ప్రేమిస్తున్నా.. ఏం చేస్కుంటావో చేస్కో అంటూ బెదిరించాడు. దీంతో వారు షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత భరత్, అతని తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చినా అతని ప్రవర్తనలో మాత్రం ఎలాంటి మార్పురాలేదు. పైగా వారిపై కక్ష పెంచుకున్నాడు. 
 
ఈ క్రమంలో బుధవారం ఉదయం 8.20 గంటల సమయంలో మధులిక ఇంటినుంచి కాలేజీకి బయలుదేరగా.. అడ్డుగా వెళ్లి ఆమెను బలవంతంగా పక్క గల్లీలోకి లాక్కెళ్లాడు. అందరూ చూస్తుండగానే విచక్షణారహితంగా కత్తితో దాడిచేసి పారిపోయాడు. అక్కడికక్కడే కుప్పకూలిన మధులికను కుటుంబసభ్యులు కాచిగూడలోని సాయికృష్ణ న్యూరో ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మలక్‌పేట యశోద ఆస్పత్రికి తీసుకెళ్లారు. 
 
మధులికపై పదునైన ఆయుధంతో విచక్షణారహితంగా పొడవడంతో యువతి శరీరంలో 15 చోట్ల పెద్ద గాయాలున్నాయని, తీవ్ర రక్తస్రావమైందని, శ్వాస తీసుకునే స్థితిలో లేకపోవడంతో కృత్రిమ శ్వాసను అందిస్తున్నామని వైద్యులు వెల్లడించారు. తలపై, వెనుకభాగంలో బలమైన గాయాలయ్యాయని, పుర్రె ఎముక విరిగి మెదడులోకి చొచ్చుకెళ్లిందని చెప్పారు. 72 గంటల వరకు ఏమీ చెప్పలేమని, పరిస్థితి విషమంగానే ఉందని వెల్లడించారు. 
 
ఈ విషయం తెలియగానే ప్రేమోన్మాదిని పట్టుకునేందుకు ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగాయి. బుధవారం సాయంత్రానికే భరత్‌ను అరెస్టుచేశారు. హత్యకు ఉపయోగించిన కొబ్బరిబోండాల కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నామని, ఐపీసీ సెక్షన్ 307తోపాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.