నేడు జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోడీ
దేశ వ్యాప్తంగా అమల్లో ఉన్న అన్‌లాక్-1 జూన్ 30వ తేదీతో ముగియనుంది. దీంతో జూలై ఒకటో తేదీ నుంచి కొత్త మార్గదర్శకాలను కేంద్రం సోమవారం రాత్రి విడుదలచేసింది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం సాయంత్రం 4 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. భారత్-చైనా దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగించనుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ నేపథ్యంలో ప్రధాని ప్రజలకు ఏం చెప్పబోతున్నారన్న దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే, నేటితో అన్‌లాక్-1 ముగియనున్న నేపథ్యంలో అన్‌లాక్-2కు సంబంధించి మోదీ మాట్లాడే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు.
మరోవైపు, భారత్ - చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనివున్నాయి. ఈ ఉద్రిక్తతలు సద్దుమణిగేలా ఇరు దేశాల సైనిక కమాండర్ స్థాయి చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు, దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని భావించిన చైనాకు చెందిన 59 యాప్‌లను కేంద్రం నిషేధించింది.