శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎంజీ
Last Updated : శనివారం, 4 సెప్టెంబరు 2021 (19:38 IST)

భారత జాతి ఐకమత్యమే అన్నింటికన్నా ముఖ్యం: ఉపరాష్ట్రపతి పిలుపు

భారతదేశాన్ని కుల, మత, ప్రాంత, భాష, వర్ణ, జాతి ఆధారంగా విడదీయాలని చూస్తున్న దేశ విభజన శక్తులతో పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

భారతదేశ 75వ స్వాతంత్ర్య సంబరాలను జరుపుకుంటున్న ఈ సమయంలో.. అలాంటి జాతివ్యతిరేక శక్తులను తుదముట్టించడం ద్వారా దేశ ఐకమత్యానికి కృషిచేయడాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలన్నారు. 
శ్రీ అరబిందో 150వ జయంత్యుత్సవాల ప్రారంభ సూచకంగా హైదరాబాద్‌లోని శ్రీ అరబిందో ఇంటర్నేషనల్ స్కూల్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రత్యేకమైన ప్రదర్శనను ఉపరాష్ట్రపతి ప్రారంభించారు.

ఈ సందర్భంగా శ్రీ అరవిందుల వారికి ఆయన నివాళులు అర్పించారు. భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశ ప్రత్యేకత అన్న ఉపరాష్ట్రపతి, ఈ ఆదర్శాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ భారతదేశ భవిష్యత్తును మరింత ప్రకాశవంతంగా, గౌరవప్రదంగా చేయడంలో దేశ యువత ప్రత్యేకమైన చొరవతీసుకోవాలని సూచించారు. దేశంలో శాంతి, సామరస్యాలను కాపాడాలన్నారు.

భారతదేశ సంస్కృతికి మన ఆధ్యాత్మికతే మూలమన్న ఉపరాష్ట్రపతి, మన ఆధ్యాత్మికతతో ప్రపంచానికి వెలుగులు పంచేందుకు శ్రీ అరవిందుల వారు విశేషమైన కృషిచేశారన్నారు. ప్రస్తుత ప్రపంచానికి ఆధ్యాత్మిక చేతన ఎంతో అవసరమని, ఇందుకోసం శ్రీ అరవిందులవారి స్ఫూర్తితో మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆయన సూచించారు. మన దైనందిన జీవితంలోనూ ఆధ్యాత్మికత ఎంతో ప్రశాంతతను ఇస్తుందన్నారు.

భారతగడ్డపై పుట్టిన యువతలో సహజంగానే అపారలమైన శక్తిసామర్థ్యాలున్నాయని,వాటిని గుర్తించి, ఆ సామర్థ్యానికి సరైన పదునుపెట్టి, స్వతంత్ర ఆలోచనలతో పురోగతి సాధించాలని ఉపరాష్ట్రపతి సూచించారు. పాశ్చాత్య పద్ధతులను అనుసరించేకంటే మనవైన ఆలోచనలతో ముందుకెళ్లడమే మన అస్తిత్వాన్ని ఘనంగా ప్రపంచానికి చాటి చెబుతుందన్నారు. ఈ దిశగా యువత ఆలోచన చేయాలన్నారు.

ఘనమైన భారతదేశ చరిత్రను పునర్లిఖించాల్సిన అవసరాన్ని కూడా ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి నొక్కిచెప్పారు. మన విలువైన సంస్కృతి, సంప్రదాయాలను యావత్ ప్రపంచం స్వాగతిస్తోందని, అది మనకు గర్వకారణమని ఉపరాష్ట్రపతి అన్నారు. ఆ గౌరవాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడాన్ని కూడా యువత బాధ్యతగా తీసుకెళ్లాలన్నారు.

శ్రీ అరవిందుల వారు గొప్ప యోగి, తత్వవేత్త, కవి, స్వాతంత్ర్య సమరయోధుడిగా మనకెంతో స్ఫూర్తిని పంచారన్న ఉపరాష్ట్రపతి, తన రచనల ద్వారా మనలో సంపూర్ణ స్వాతంత్ర్య భావనను మనలో రగిలించడంతోపాటు, ఆధ్యాత్మిక భావనను జాగృతం చేయడం ద్వారా మనలో నిరంతరం కొత్తశక్తిని సృష్టించుకునేందుకు మార్గదర్శనం చేశారని గుర్తుచేశారు.

1947లో భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారతజాతిని ఉద్దేశించిన శ్రీ అరవిందులవారు ఇచ్చిన సందేశాన్ని ఉపరాష్ట్రపతి ప్రస్తావిస్తూ, మానవ నాగరికత అభివృద్ధిలో ఆసియా ప్రాంతం కీలకపాత్ర పోషించాలని, స్వయం సమృద్ధితో సమైక్య భారతదేశం, ఆసియా అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాలంటూ అభిలషించిన విషయాన్ని గుర్తుచేశారు. వ్యక్తిగతంగా, సామాజికంగా, దేశంగా మనమంతా ఐకమత్యంతో, జాతీయవాదంతో, ఆధ్యాత్మిక భావనతో ముందుకెళ్లడమే ఇందుకు సాధనమన్న శ్రీ అరవిందుల వారి మాటలను ఉపరాష్ట్రపతి ప్రస్తావించారు.
 
నేడు విశ్వమానవాళి ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి శ్రీ అరవిందులవారు సూచించినట్లుగా ఆధ్యాత్మిక చేతన, సచేతనత్వమే సరైన మార్గదర్శనం చేస్తుందని, పుదుచ్చేరిలో ‘అరోవిల్లే’ను శ్రీ అరవిందులవారు ఏర్పాటుచేయడమే ప్రపంచ ఐకమత్యం కోసం వారి ఆలోచనకు నిదర్శనమన్నారు. శ్రీ అరవిందుల వారి స్వప్నాన్ని సాకారం చేసేందుకు యువత కృషి చేయాలని ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు. 

విద్యాభ్యాసం కేవలం ఉద్యోగాన్వేషణ కోసమో, జీవనోపాధి కోసమో కాకూడదని, విజ్ఞాన సముపార్జన, మాతృభూమికోసం పనిచేయడం, దేశాభివృద్ధిలో భాగస్వాములు కావడమే విద్య ద్వారా మనకు అలవడాలన్న శ్రీ అరవిందుల వారి స్వప్నాన్ని ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు. ఈ దిశగా, విద్యార్థుల్లో చదువుతోపాటు నైతికత, ఆధ్యాత్మికతతోపాటు సామాజిక బాధ్యత వంటి వాటిని బోధిస్తున్న శ్రీ అరబిందో ఇంటర్నేషనల్ స్కూల్కృషిని ఆయన అభినందించారు. 

భారతీయ ప్రాచీన విజ్ఞానాన్ని తర్వాతి తరాలకు అందించడంలో ఉపాధ్యాయులదే కీలకమైన పాత్ర అని ఉపరాష్ట్రపతి సూచించారు. విలువలతో కూడిన విద్య ద్వారానే భారతదేశం తన సంపూర్ణ శక్తిసామర్థ్యాలను తెలుసు కోగలుగుతుందన్నారు. 

శ్రీ అరవిందుల వారి జీవితం, సందేశాన్ని ప్రతిబింబించేలా ప్రదర్శనను ఏర్పాటుచేసిన పాఠశాల యాజమాన్యాన్ని ఉపరాష్ట్రపతి అభినందించారు. కార్యక్రమం ప్రారంభంలో శ్రీ అరవిందుల జీవితాన్ని ప్రతిబింబించేలా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించిన విద్యార్థులను వేదికపైకి పిలిచి మరీ ఉపరాష్ట్రపతి అభినందించారు.

ఈ కార్యక్రమంలో కర్ణాటక ఒడిశా మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీరామచంద్రుడు తేజావత్, మణిపూర్ విశ్వవిద్యాలయ కులపతి ఆచార్య తిరుపతి రావు, పాఠశాల అధ్యాపకులు, పలువురు విద్యార్థులు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు.