శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

వివాదంలో ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ : పుస్తకావిష్కరణ వాయిదా

somanath
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ సోమనాథ్ పేరు మార్మోగిపోతుంది. ఇస్రో సాధిస్తున్న విజయాల వెనుక ఆయన కృషి, నిబద్ధత దాగివుంది. ఈ నేపథ్యంలో ఇపుడు వివాదంలో చిక్కుకున్నారు. తన జీవిత చరిత్రపై రాసిన పుస్తకం ఈ వివాదానికి కారణమైంది. దీంతో ఆ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని ఆయన తాత్కాలికంగా వాయిదా వేశారు. 
 
పుస్తకం వివాదంలో చిక్కుకుంది. ఆ పుస్తకం పేరు 'నిలవు కుడిచ్చ సింహంగళ్'... ఇది మలయాళ పుస్తకం. ఆ పేరుకు అర్థం 'వెన్నెలను తాగిన సింహాలు'. సోమనాథ్ తన పుస్తకంలో ఇస్రో మాజీ చీఫ్ కె.శివన్‌పై కొన్ని విమర్శలు చేశారంటూ తాజాగా వివాదం తలెత్తింది. తాను ఇస్రో ఛైర్మన్ పదవిని చేపట్టకుండా అడ్డుకునేందుకు శివన్ ప్రయత్నించారని సోమనాథ్ తన పుస్తకంలో ఆరోపించినట్టు తెరపైకి వచ్చింది. 
 
దీనిపై సోమనాథ్ స్పందించారు. తాను పుస్తకంలో పేర్కొన్న అంశాలను తప్పుగా అర్థం చేసుకున్నారని, శివన్ తన ఎదుగుదలను అడ్డుకున్నట్టు తాను ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు. సాధారణంగా స్పేస్ కమిషన్‌లో సభ్యుడిగా ఎంపికైతే ఇస్రో ఛైర్మన్ పదవి ఖాయమని ఓ అభిప్రాయం ఉందని, కానీ ఇస్రో నుంచి మరో డైరెక్టర్‌ను నియమించడంతో తనకు అవకాశాలు తగ్గిపోయాయని మాత్రమే తాను పుస్తకంలో పేర్కొన్నానని సోమనాథ్ వివరణ ఇచ్చారు. 
 
ఈ వివాదం కారణంగా తన పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంటున్నట్టు సోమనాథ్ తెలిపారు. ఈ పుస్తకం ఇంకా విడుదల కాలేదని, ప్రచురణకర్త అభిప్రాయ సేకరణ కోసం కొన్ని కాపీలను విడుదల చేసి ఉండొచ్చని వివరించారు. అందుకే పుస్తకావిష్కరణను నిలిపివేద్దామని నిర్ణయించుకున్నానని వెల్లడించారు. అసలు ఈ పుస్తకాన్ని తాను రాయడానికి కారణం యువతను ఉత్తేజపరిచేందుకేనని స్పష్టంచేశారు. 
 
ఈ వివాదం తెరమీదకు రాకమునుపే ఆయన జాతీయ మీడియాతో తన కెరీర్‌కు సంబంధించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రయాన్-3 మిషన్ విజయం అనంతరం ఆయన పలు విషయాలను మీడియాతో పంచుకున్నారు. 'నా జీవితంలో అందరూ నాతో మంచిగా ప్రవర్తించారని నేను అనుకోవట్లేదు. వ్యక్తిగత జీవితంలో, వృత్తిగత జీవితంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నాను. నిన్ను (తన గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ..) సడెన్‌గా సంస్థ నుంచి తొలగించొచ్చు. లేదా నీ స్థానానికే ప్రమాదం ఏర్పడొచ్చు. కొన్ని సార్లు నీకు కనీస గౌరవం కూడా దక్కకపోవచ్చు' అని ఆయన పేర్కొన్నారు. తాను అనేక విమర్శలు ఎదుర్కొన్నానని, తన నైపుణ్యాలపై సందేహాలు కూడా వ్యక్తమయ్యాయయని తెలిపారు. కానీ ఇలాంటి వాటిని ఎలా అధిగమించాలో తాను నేర్చుకున్నానని వ్యాఖ్యానించారు.