సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 25 ఆగస్టు 2023 (20:12 IST)

వయనాడ్‌లో ఘోర ప్రమాదం... తొమ్మిది మంది మృతి

car accident
కేరళ రాష్ట్రంలోని వయనాడ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న జీపు 25 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్లాంటేషన్‌ కార్మికులతో వెళ్తున్న ఈ జీపు తళప్పుఝాలోని కన్నోత్‌ హిల్‌ వద్ద ప్రమాదానికి గురైంది. పనులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. 
 
ప్రాథమిక సమాచారం ప్రకారం మృతులంతా వయనాడ్‌కు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనలో గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. మృతుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ దుర్ఘటన సమయంలో డ్రైవర్‌తో పాటు మొత్తం 13 మంది జీపులో ఉన్నారు. క్షతగాత్రులను వయనాడ్‌ ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్యను జిల్లా వైద్య అధికారి నిర్ధారించారు. ఈ ప్రమాదంలో జీపు నుజ్జునుజ్జయింది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు.
 
ఈ దుర్ఘటనపై సీఎం పినరయి విజయన్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఘటనా స్థలానికి వెళ్లాలని అటవీశాఖ మంత్రి ఏకే శశీంద్రన్‌ను ఆదేశించారు. క్షతగాత్రులకు చికిత్స అందించేందుకు తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారని సీఎంవో తెలిపింది. మరోవైపు, ఈ ఘటనపై వయనాడ్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జిల్లా అధికార యంత్రాంగంతో మాట్లాడానని.. త్వరగా స్పందించాలని కోరినట్టు చెప్పారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపిన రాహుల్‌.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్‌ చేశారు.