సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 25 ఆగస్టు 2023 (17:12 IST)

బాంబే ఐఐటీకి రూ.160 కోట్ల విరాళం ఇచ్చిన పూర్వ విద్యార్థి

cash notes
దేశంలోని ఉన్నత విద్యా సంస్థల్లో ఒకటిగా పేరుగడించిన బాంబే ఐఐటీకి  పూర్వవిద్యార్థి ఒకరు భారీ విరాళాన్ని ఇచ్చారు. ఈ విద్యార్థి రూ.160 కోట్లకు చెక్ రాసి పంపించాడని ఐఐటీ బాంబే డైరెక్టర్ ప్రొఫెసర్ సుభాసిస్ చౌదరి వెల్లడించారు. అయితే, తన పేరు వెల్లడించవద్దని దాత కోరడంతో వివరాలను గోప్యంగా ఉంచాల్సి వస్తోందన్నారు.
 
ఈ మొత్తాన్ని గ్రీన్ ఎనర్జీ అండ్ సస్టైనబిలిటీ రీసెర్చ్ హబ్ ఏర్పాటుకు వెచ్చిస్తామన్నారు. ఐఐటీ బాంబేకు ఇచ్చే విరాళం సరైన పనికి ఉపయోగపడుతుందని సంస్థ పూర్వ విద్యార్థులతో పాటు అందరికీ తెలుసని డైరెక్టర్ చెప్పారు. 
 
కాగా, ఇంత పెద్ద మొత్తంలో విరాళం అందించి కూడా ప్రచారం కోరుకోకపోవడం దాతకున్న గొప్ప మనసును చాటుతోందని ప్రశంసించారు. బహుశా యూనివర్సిటీ అందుకున్న డొనేషన్లలో ప్రచారం కోరుకోని వ్యక్తి ఈ దాత మాత్రమే కావొచ్చని చెప్పారు.
 
ఐఐటీ బాంబే పూర్వ విద్యార్థి, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని కూడా ఇటీవల ఐఐటీ బాంబేకు రూ.315 కోట్ల విరాళం అందించారు. నందన్ నీలేకని 1973లో ఇక్కడి నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పట్టా పొందారు. ఐఐటీ బాంబేలో చేరి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన ఈ విరాళాన్ని అందించారు. 
 
ఐఐటీ బాంబే ఇప్పటివరకు అందుకున్న విరాళాల్లో ఇదే భారీ మొత్తం కావడం విశేషం. గతంలోనూ నీలేకని రూ.85 కోట్లు విరాళంగా ఇచ్చారు. దీంతో ఐఐటీ బాంబేకు నీలేకని ఇచ్చిన మొత్తం విరాళం రూ.400 కోట్లు అని డైరెక్టర్ ప్రొఫెసర్ సుభాసిస్ చౌదరి తెలిపారు.