మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 9 జులై 2021 (08:00 IST)

బెంగుళూరులో బంగ్లాదేశ్ యువతిపై గ్యాంగ్ రేప్

దేశ ఐటీ రాజధానిగా ఉన్న బెంగుళూరులో బంగ్లాదేశ్ యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ కేసులోని మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం 12 మంది నిందితులను అరెస్టు చేశారు. 22 ఏళ్ల యువతిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితులు ఆ ఘటనను వీడియో తీసి వైరల్ చేశారు. అరెస్టు అయిన 12 మందిలో 11 మంది బంగ్లాదేశ్ వారే కాగా, వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉండడం గమనార్హం.
 
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, రెండేళ్ల క్రితం బంగ్లాదేశ్ నుంచి బెంగళూరు వచ్చిన బాధిత యువతి ఓ బార్‌లో డ్యాన్సర్‌గా చేరింది. అంతకుముందు ఆమె దుబాయ్‌లో బార్‌లో పనిచేసేది. భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన యువతి తొలుత హైదరాబాద్‌లో ఓ మసాజ్ పార్లర్‌లో పనిచేసింది.
 
ఈ క్రమంలో తనకు పరిచయం ఉన్న నలుగురు యువకులు, ఇద్దరు యువతులను బంగ్లాదేశ్ నుంచి అస్సాం మార్గంలో భారత్‌లోకి అక్రమంగా రప్పించి బెంగళూరులో స్థిరపడేలా చేసింది. నగరంలోని సుబ్రహ్మణ్యస్వామినగరలో ఇంటిని అద్దెకు తీసుకుని అదే చిరునామాతో ఆధార్ కార్డులను కూడా సమకూర్చిపెట్టింది.
 
ఆమె సాయంతో నగరానికి వచ్చి కుదురుకున్న వారు తర్వాత ఆమెను బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి దింపారు. అంతేకాక, ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చే యువతులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని వృభిచారంలోకి దింపేవారు. వారి చెరలో చిక్కుకున్న బాధితురాలు తను వ్యభిచారం మానేసి సొంతంగా స్పా పెట్టుకుంటానని తెగేసి చెప్పింది.
 
ఈ క్రమంలో వారి మధ్య నగదు లావాదేవీల విషయంలో గొడవ మొదలైంది. స్పా పెట్టవద్దంటూ యువతిని మంచానికి కట్టేసి సామూహిక అత్యాచారానికి పాల్పడి వీడియో తీశారు. ఆమె ప్రైవేటు భాగాలపై మద్యం సీసాలతో దాడిచేశారు. అదే నెల 19న వీడియో సోషల్ మీడియాలో కనిపించింది. ఇది వైరల్ అవుతుండగానే మరో వీడియోను పోస్టు చేశారు.
 
ఈ వీడియోలను చూసిన కొందరు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అప్పట్లోనే నలుగురు యువకులు, ఇద్దరు యువతులను అరెస్టు చేశారు. హైదరాబాద్‌కు చెందిన హకీల్, బంగ్లాదేశ్‌కు చెందిన సాగర్, మహ్మద్ బాబా కేశ్, రియాద్ బాబు, నస్రత్, కాజల్‌లను నిందితులుగా గుర్తించారు. 
 
నస్రత్, కాజల్ ఇద్దరూ రియాద్ బాబు భార్యలు కావడం గమనార్హం. రియాద్, సాగర్ పారిపోయే క్రమంలో పోలీసుల కాల్పుల్లో గాయపడ్డారు. నిందితులపై మానవ అక్రమ రవాణా, అత్యాచారం, నిర్భయ తదితర చట్టాల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
 
ఇపుడు ఈ కేసులోని పూర్తి మిస్టరీని ఛేదించిన పోలీసులు... కేసుకు సంబంధించిన చార్జిషీటును కోర్టుకు సమర్పించారు. అలాగే, లక్ష రూపాయల రివార్డును కూడా మంజూరు చేశారు.