గురువారం, 12 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 6 డిశెంబరు 2024 (18:06 IST)

నటుడు దిలీప్‌కు వీఐపీ దర్శనమా? తప్పుబట్టిన కేరళ హైకోర్టు

dileep
వేలాది మంది భక్తులు క్యూలైన్లలో పడిగాపులు కాస్తూ ఉంటే సినీ నటుడు దిలీప్‌కు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (శబరిమల ఆలయం) వీఐపీ దర్శన ఏర్పాట్లు చేయడంతో కేరళ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శబరిమల ఆలయానికి వచ్చిన నటుడు దిలీప్‌కు ఆలయ అధికారులు రాచమర్యాదలు చేసి వీఐపీ దర్శనం కల్పించింది. ఇందుకోసం సాధారణ భక్తులను క్యూలైన్లలో గంటల తరబడి నిలబెట్టింది. దీనికి సంబంధించిన వార్తలు మీడియాలో వచ్చాయి. ఇవి వైరల్ కావడంతో కేరళ హైకోర్టు ఈ విషయాన్ని సుమోటాగా తీసుకుని విచారించింది. 
 
నటుడు దిలీప్‌కు ఆలయంలో చాలా సమయంపాటు నటుడు ఆలయంలో ఉండటానికి ఎలా అనుమతిచ్చారని టీడీబీని ప్రశ్నించింది. ఆయన వల్ల పిల్లలు, వృద్ధులు సహా ఇతర భక్తులు గంటల తరబడి లైన్లలో వేచి ఉండాల్సి వచ్చిందని పేర్కొంది. యాజమాన్యమే ఇలా ప్రవర్తిస్తే.. భక్తులు ఎవరికి ఫిర్యాదు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
 
రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులకు మాత్రమే వీఐపీ దర్శనం కల్పించాల్సి ఉంటుందని.. ఇతరులకు ప్రత్యేక దర్శనం కల్పించడం నిబంధనలకు విరుద్ధమని.. టీడీబీపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టి శనివారంలోగా ఈ విషయానికి సంబంధించిన వీడియో ఫుటేజీ, నివేదికను కోర్టుకు సమర్పించాలని న్యాయమూర్తులు జస్టిస్‌ నరేంద్రన్, జస్టిస్‌ మురళీ కృష్ణలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. నటుడిని ప్రతివాదిగా చేర్చాలని వస్తున్న డిమాండ్లను పరిశీలిస్తామని తెలిపింది.