మణిపూర్‌లో మహిళల నగ్న ప్రదర్శన : ఆరో నిందితుడు అరెస్టు
ఈశాన్య భారత రాష్ట్రమైన మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనకు సంబంధించి ఆ రాష్ట్ర పోలీసులు ఆరో నిందితుడిని అరెస్టు చేశారు. 'శనివారం మరో నిందితుడు అరెస్టయ్యాడు. ఐదుగురు ప్రధాన నిందితులు, ఒక జువెనల్‌తో సహా మొత్తం ఆరుగురు అరెస్టయ్యారు' అని మణిపూర్ పోలీసులు ట్విట్టర్లో తెలిపారు.
మరోవైపు, ఎలాంటి ఉద్రిక్తతలు చెలరేగకుండా మణిపూర్ పోలీసులు, కేంద్ర బలగాలతో రాష్ట్రవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. పలు అనుమానిత స్థావరాలపై దాడులు నిర్వహించి మిగతా నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కాగా, మే 4న ముగ్గురు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన గుంపుకు చెందిన అరెస్టైన నలుగురు నిందితులను 11 రోజుల పోలీస్ కస్టడీకి ఇచ్చారు. ప్రతిపక్షం పార్లమెంటు ఉభయ సభలలో ఈ అంశాన్ని లేవనెత్తింది. మణిపూర్ ఉదంతంపై ఉభయసభలు వరుసగా రెండో రోజు వాయిదా వేయవలసి వచ్చింది.
పెద్ద ఎత్తున తరలి వెళ్లిన మహిళలు ఈ కేసులో ప్రధాన నిందితుడి ఇంటిని తగులబెట్టినట్లు శుక్రవారం స్థానిక మీడియా పేర్కొంది. రాష్ట్రంలో శాంతిని పునరుద్ధరించడం, మహిళల్ని నగ్నంగా ఊరేగించిన నిందితులను చట్టపరంగా శిక్షించడం తమ ముందు ఉన్న కర్తవ్యమని ప్రభుత్వం చెబుతోంది. దోషులను ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని మణిపూర్ సీఎం చేస్తున్న హెచ్చరికలు కేవలం మాటలకే పరిమితమవుతున్నాయి.