సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 17 సెప్టెంబరు 2020 (12:11 IST)

70వ వసంతంలోకి ప్రధాని నరేంద్ర మోడీ.. శుభాకాంక్షల వెల్లువ

ప్రధాని నరేంద్ర మోడీ 70వ జన్మదినోత్సవ వేడుకలు గురువారం జరుపుకుంటున్నారు. దీంతో ఆయనకు దేశ విదేశాల నుంచి శుభాకాంక్షల వరద  పారుతోంది. ముఖ్యంగా రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 
 
భ‌గ‌వంతుడు మిమ్మ‌ల్ని ఎల్ల‌ప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉంచాల‌ని ప్రార్థిస్తున్న‌ట్లు తెలిపారు. భార‌త‌దేశ జీవ‌న విలువ‌లు పాటిస్తూ, ప్ర‌జాస్వామ్య సాంప్ర‌దాయ ఆద‌ర్శాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ దేశాన్ని అంత‌ర్జాతీయంగా ఉన్న‌త‌స్థానానికి తీసుకెళ్లారని కొనియాడారు. మోడీ నాయకత్వంలో ఆత్మనిర్భరతతో కూడిన నవభారత నిర్మాణ స్వప్నం సాకారం దిశగా సాగుతుండటం ముదావహం అని వారిద్దరూ వేర్వేరుగా తమతమ ట్విట్టర్ ఖాతాల్లో పేర్కొన్నారు. 
 
అలాగే, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిరి పుతిన్‌తో పాటు అనేక దేశాల అధ్యక్షులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. అలాగే, ప్రధాని మోడీకి నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మోడీ కలకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు.
 
తెలంగాణ సీఎం కేసీఆర్
దేశానికి ఆయన గొప్ప సంప‌ద‌ అని తమిళిసై అన్నారు. భారత్‌కు మోదీ మ‌రిన్ని గొప్ప సేవ‌లు అందించాల‌ని కోరుకుంటున్నట్లు కేసీఆర్ తెలిపారు.
 
రాహుల్ గాంధీ... 
'ప్రధాని మోడీకి జన్మదిన శుభాకాంక్షలు' అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. 
 
చిరంజీవి... 
'ప్రధాని మోడీకి 70వ జన్మదినోత్సవ శుభాకాంక్షలు. మీరు దేశానికి మరిన్ని ఏళ్లపాటు సేవలు అందించేందుకు మీకు దేవుడు శక్తినివ్వాలని కోరుకుంటున్నాను' అని సినీనటుడు చిరంజీవి పేర్కొన్నారు. 
 
పవన్ కళ్యాణ్... 
'భారత ప్రధాని నరేంద్ర మోడీకి మా నుంచి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు' అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.
 
మోహన్ బాబు... 
'మన భారతదేశం బాగుపడాలంటే, దేశదేశాల్లో మన భారతదేశం గురించి చెప్పుకోవాలంటే, మోడీగారే జీవితాంతము భారత ప్రధానిగా ఉండాలి. అప్పుడే మన భారతదేశం బాగుపడుతుంది. మన భరతమాత బిడ్డ ప్రధాని మోడీగారు వంద సంవత్సరములు ఆయురారోగ్యములతో క్షేమంగా ఉండాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను' అని సినీనటుడు మంచు మోహన్ బాబు ట్వీట్ చేశారు.
 
సోము వీర్రాజు.. 
'భారతమాత ఖ్యాతిని ఖండాంతరాల వరకూ విస్తరింపజేస్తూ, నవభారత నిర్మాణంలో నిత్య కృషీవలుడిగా, సుదీర్ఘకాల సమస్యలను సున్నితంగా పరిష్కరించిన సుసాధ్యుడు, భారత మాత ముద్దుబిడ్డ మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు' అని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ట్వీట్ చేశారు.