సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 14 సెప్టెంబరు 2020 (14:25 IST)

వంటకు గ్యాస్‌ కాకుండా తక్కువ ధరకే విద్యుత్‌ సరఫరా.. ఆర్‌కే సింగ్‌

దేశవ్యాప్తంగా ఉన్న పేద ప్రజలకు త్వరలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సర్కారు గుడ్ న్యూస్ చెప్పనుంది. ఇకపై పేదలకు వంట చేసుకునేందుకు ఎల్‌పీజీకి బదులుగా విద్యుత్‌ను సరఫరా చేస్తారు. ఈ విషయాన్ని కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌ వెల్లడించారు.
 
సోమవారం ఆయన బీహార్‌లోని నబీనగర్‌, బార్హ్‌, బరౌనిలలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్‌టీపీసీకి చెందిన సర్వీస్‌ బిల్డింగ్‌, షాపింగ్‌ కాంప్లెక్స్, మెయిన్‌ ప్లాంట్‌ క్యాంటీన్‌లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోని పేదలకు ఇకపై వంటకు గ్యాస్‌ కాకుండా విద్యుత్‌ను తక్కువ ధరకే సరఫరా చేస్తామని తెలిపారు. 
 
దేశంలోని పేదలకు ఎల్‌పీజీ కాకుండా వంటకు విద్యుత్‌ను అందజేయడం వల్ల పెట్రోలియం ఉత్పత్తులపై ఆధారపడే అవకాశం తగ్గుతుందన్నారు. దీంతో పెద్ద మొత్తంలో డబ్బులు వెచ్చించి పెట్రోలియం ఉత్పత్తులను కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదని, ఇది ప్రధాని మోదీ అమలు చేస్తున్న ఆత్మ నిర్భర్‌ కార్యక్రమానికి ఊతం ఇస్తుందని చెప్పారు. ప్రధాని మోదీ ఇప్పటికే పేదల కోసం అనేక కార్యక్రమాలను చేపట్టారని, త్వరలోనే వంట కోసం విద్యుత్‌ను సరఫరా చేసే పథకాన్ని కూడా ప్రారంభిస్తారని తెలిపారు.