సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి

చైనాకు చెక్.. భారత్-నేపాల్‌ల మధ్య సూపర్ డీల్.. ఏంటది?

భారత్-నేపాల్ మధ్య సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. ఇందుకు కారణం చైనాకు చెక్ పెట్టే రైల్వే డీల్‌లో భారత్-నేపాల్ ఒప్పందం కుదుర్చుకోవడమే. చైనా రైల్వేస్ నేపాల్‌లోకి రాకుండా ముందస్తు ప్రణాళికలు వేసిన భారత ప్రభుత్వం నేపాల్‌తో రైల్వే ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కొద్దినెలల కింద భారత్‌తో నేపాల్ కొన్ని విషయాల్లో విబేధించిన సంగతి తెలిసిందే.
 
కొన్ని దశాబ్దాల పాటూ భారత్ తో సత్సంబంధాలు కలిగిన నేపాల్ ఇటీవల మ్యాపుల్లో భారత్‌కు చెందిన ప్రాంతాలను తమ ప్రాంతాలుగా చెప్పుకుంది. అయోధ్య గురించి కూడా నేపాల్ నాయకులు కొన్ని వ్యాఖ్యలు చేసి.. ఆ తర్వాత క్షమాపణలు చెప్పారు. మరోవైపు భారత్ నేపాల్‌తో సంబంధాల కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. భారత్‌కు చెందిన ఉన్నతాధికారులు నేపాల్‌లో పర్యటించి సత్సంబంధాలు మెరుగుపడడానికి కృషి చేశారు.
 
అక్టోబర్ నెలలో భారత స్పై ఛీఫ్ సమంత్ గోయల్ ఖాట్మండుకు వెళ్లి సమావేశాలు నిర్వహించారు. ఇంకా నేపాల్ విదేశాంగ మంత్రి ప్రదీప్ గ్యవాలీ ఢిల్లీ పర్యటనకు రానున్నారు. భారత్-నేపాల్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ కోసం ఆయన రాబోతున్నారు.
 
ఈ నేపథ్యంలో నేపాల్ అధికారులు భారత్ రైల్వే ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. భారత్‌కు చెందిన కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ చేపట్టిన డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టుకు సమ్మతం తెలిపింది. ఇందులో భాగంగా నేపాల్ రాజధాని ఖాట్మండును రక్సుల్ నగరంతో కనెక్ట్ చేసే అవకాశం ఉంది.
 
బోర్డర్‌లో ఉన్న భారత పట్టణమైన రక్సుల్ నుండి నేపాల్‌కు రైల్వే లైన్ వేయడం విశేష అంశం. రక్సుల్‌ను 'నేపాల్ గేట్ వే టు ఇండియా' అని అంటారు. ఢిల్లీ నుండి కోల్‌కతా.. అక్కడి నుండి రక్సుల్ పట్టణం.. ఆ తర్వాత ఖాట్మండుకు రైల్వే లైన్ ఉండనుంది. ఇది భారత్‌కు ఎంతో కీలకం కానుంది.
 
భారత ప్రభుత్వానికి ఆగస్టు నెలలో అనుమతి లభించిందని నేపాల్ ఉన్నతాధికారులు తెలిపారు. ఈ రైల్వే లైన్ పొడవు 136 కిలోమీటర్లు కాగా.. 42 కిలోమీటర్లు దాదాపు సొరంగ మార్గం గుండా ప్రయాణం ఉంటుంది. మూడు ట్రిలియన్ల నేపాలీ రూపాయలతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా చైనాకు భారత్ చెక్ పెట్టనుంది.