ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 21 మే 2024 (11:56 IST)

గుజరాత్‌లో నవ వధువును కిడ్నాప్ చేసిన సాయుధ దుండగులు!!

bride
గుజరాత్ రాష్ట్రంలో నవ వధువు కిడ్నాప్‌కు గురైంది. 15 మంది సాయుధ దుండగులు ఈ చర్యకు పాల్పడ్డారు. పెళ్లి ఊరేగింపును అడ్డగించి, కారులో ఉన్న వధువును కిడ్నాప్ చేశారు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని దహోద్ జిల్లాలో వెలుగు చూసింది. దీనిపై ఫిర్యాదు అందుకుని పోలీసులు... తక్షణం రంగంలోకి దిగి కొందరిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం మేరకు వివరాలను పరిశీలిస్తే, 
 
ఆదివారం రాత్రి వివాహ అనంతరం వధూవరులను ఊరేగించారు. ఊరేగింపు నవగామ్‌కు చేరుకోగానే సాయుధులైన 15 మంది దుండగులు వధూవరులు ఉన్న కారును అడ్డుకున్నారు. ఆపై నవ వధువు ఉష (22)ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. 
 
ఆ వెంటనే వరుడు రోహిత్ అమలియార్ (23) పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిడ్నాప్ సూత్రధారులంటూ ఐదుగురు పేర్లు చెప్పిన రోహిత్ మరో పది మంది కూడా కిడ్నాప్‌లో పాల్గొన్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎనిమిది మంది నిందితులను గుర్తించి, ఇప్పటివరకు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 
 
కిడ్నాప్ వ్యవహారంలో మహేశ్ భూరియాను ప్రధాన నిందితుడిగా గుర్తించినట్టు దహోద్ డివిజన్ డీఎస్పీ జగదీశ్ సింగ్ భండారీ తెలిపారు. నవ వధువు ఉష, నిందితుల దూరపు బంధువులని పేర్కొన్నారు. మహేశ్ కజిన్ ఒకరు ఉష కుటుంబంలోని వ్యక్తిని పెళ్ళి చేసుకున్నారు. ఉషను కిడ్నాప్ చేసిన నిందితుడు మధ్యప్రదేశ్ వెళ్ళి ఉంటాడని అనుమానిస్తున్నారు. అక్కడి పోలీసులతో సమన్వయం చేసుకుంటున్నట్టు చెప్పారు. నిందితులకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు.