బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 4 మే 2021 (20:10 IST)

థియేటర్‌లో కాదు.. శ్మశానాల్లో ‘హౌస్‌ ఫుల్‌’

బెంగళూరు: హౌస్‌ఫుల్‌ బోర్డులు మనం ఇప్పటివరకు సినిమా థియేటర్లకే చూశాం.. కానీ ఇప్పుడు కరోనా కల్లోలంతో శ్మశాన వాటికలకు హౌస్‌ఫుల్‌ బోర్డులు పెట్టాల్సిన పరిస్థితి. కర్నాటకలో మహమ్మారి కరోనా తీవ్రస్థాయిలో దాడి చేస్తోంది. దీంతో పెద్ద ఎత్తున కేసులు.. మరణాలు సంభవిస్తున్నాయి. ఆదివారం ఒక్కరోజే 217 మరణాలు సంభవించాయి. ఆ రాష్ట్రంలో మరణాలు భారీగా చోటుచేసుకుంటుండడంతో శ్మశానాలన్నీ నిండిపోతున్నాయి.
 
మృతదేహాలు భారీగా చేరుకుంటుండడంతో శ్మశానాలు కిటకిటలాడుతున్నాయి. కరోనాతో చనిపోయిన శవాలు భారీగా వస్తుండడంతో శ్మశాన వాటిక నిర్వాహకులు వాటికి అంత్యక్రియలు చేయలేకపోతున్నారు. ఖననం చేయడానికి శ్మశానాల్లో ఖాళీ ఉండడం లేదు. దీంతో బెంగళూరులోని పలు శ్మశానవాటికలు ‘హౌస్‌ఫుల్‌’ అనే బోర్డులు తగిలించేస్తున్నాయి. చామ్‌రాజ్‌పేటలోని శ్మశాన వాటిక ‘హౌస్‌ఫుల్‌’ అనే బోర్డు తగిలించేసింది. 
 
శ్మశానంలో రోజుకు 20కి పైగా కరోనాతో మరణించిన మృతదేహాలు వస్తుండడంతో ఈ మేరకు శ్మశాన వాటిక నిర్వాహకులు బోర్డు పెట్టేశారు. బెంగళూరులో 13 విద్యుత్‌ దహన వాటికలు ఉండగా అవి నిరంతరం బిజీగా ఉంటున్నాయి. శ్మశానాల కొరత ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం బృహత్‌ బెంగళూరు మహానగర్‌ పాలికె (బీబీఎంపీ)కి 230 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. వాటిలో అంత్యక్రియల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. దీంతో ప్రభుత్వం అంత్యక్రియలపై ఆలోచన చేసింది.
 
మృతుల కుటుంబీకులే తమ సొంత ప్లాట్లు, ఫామ్‌హౌస్‌, పొలాలు ఉంటే అక్కడే ఖననం.. లేదా అంత్యక్రియలు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ప్రస్తుతం కర్నాటకలో కరోనా కేసులు 16 లక్షలు దాటాయి. కొత్తగా 37,733 కేసులు నమోదు కాగా, మరణాలు 217 సంభవించాయి. ఇవి అధికారికంగా ప్రకటించినవే. అనధికారికంగా ఎన్నో ఉన్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.