గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

నేటి నుంచి బడ్జెట్ పార్లమెంట్ సమావేశాలు... రాష్ట్రపతి ప్రసంగానికి విపక్షాలు దూరం!

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాలు కూడా కరోనా మార్గదర్శకాల మేరకు జరగనున్నాయి. శుక్రవారం ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. 
 
ఆ తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆర్థిక సర్వేను పార్లమెంటుకు సమర్పించనున్నారు. కాగిత రహిత బడ్జెట్‌ నేపథ్యంలో అధికారిక పత్రాలను సభకు సమర్పించిన వెంటనే అన్ని పత్రాలు, ఆర్థిక సర్వే ఆన్‌లైన్లో అందుబాటులోకి వస్తాయని లోక్‌సభ సెక్రటేరియట్‌ వర్గాలు తెలిపాయి. 
 
ఆ తర్వాత ఫిబ్రవరి ఒకటిన ఆర్థికమంత్రి లోక్‌సభలో 2021-22 బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కరోనా మార్గదర్శకాలకు అనుగుణంగా సమావేశాలు జరగనున్నందున రాజ్యసభ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, లోక్‌సభ సమావేశాలు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జరగనున్నాయి. 
 
రెండు విడతలుగా జరిగే సమావేశాల్లో తొలి విడత శుక్రవారం నుంచి ఫిబ్రవరి 15 వరకు, రెండో దశ సమావేశాలు మార్చి 8 నుంచి ఏప్రిల్‌  8వ తేది వరకు జరగనున్నాయి. ఈసారి మొత్తం 33 రోజులో పార్లమెంట్ పని చేయనుంది. అయినప్పటికీ జీరో అవర్‌, ప్రశ్నోత్తరాల సమయం యధాతథంగా జరగనున్నాయి. 
 
కాగా, శుక్రవారం సాయంత్రం అన్నిపార్టీల నేతలతో లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. 30న ప్రధాని నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరగనుంది. 31న రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్య నాయుడు అన్ని పక్షాల నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. గత వర్షాకాల సమావేశాల మాదిరిగానే ఈసారి కూడా సభ్యులు రెండు సభల్లో కూర్చోనున్నారు. 
 
సెంట్రల్‌ హాల్‌లో రాష్ట్రపతి చేయనున్న ప్రసంగం కార్యక్రమానికి పరిమితి సంఖ్యలో 144  మంది సభ్యులను మాత్రమే అనుమతించనున్నారు. రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు సహా 1209 సిబ్బందికి టెస్టులు నిర్వహించినట్టు రాజ్యసభ సచివాలయ వర్గాలు చెప్పాయి. 
 
ఇదిలావుంటే పార్లమెంట్‌ ఉభయసభలను ఉద్దేశించి శుక్రవారం రాష్ట్రపతి చేసే ప్రసంగాన్ని బహిష్కరించాలని 18 ప్రతిపక్షాలు నిర్ణయించాయి. కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్న రైతులకు సంఘీభావంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు విపక్షాలు పేర్కొన్నాయి. కాంగ్రెస్‌, ఎన్సీపీ, శివసేన, తృణమూల్‌ ఆధ్వర్యంలో గురువారం సమావేశమైన ప్రతిపక్ష నేతలు ఈమేరకు దీనిపై నిర్ణయం తీసుకున్నారు.
 
'కొత్త వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలన్న రైతుల డిమాండ్లపై ప్రధాని, బీజేపీ అహానికి పోతున్నారు. ప్రభుత్వం మొండివైఖరిని మేం తీవ్రంగా నిరసిస్తున్నాం. రైతు వ్యతిరేక చట్టాలను రద్దుచేయాలని గట్టిగా కోరుతున్నాం. రైతులకు మద్దతుగా రాష్ట్రపతి చేయనున్న ప్రసంగాన్ని బహిష్కరించాలని నిర్ణయించాం' అని విపక్ష పార్టీల నేతలు ప్రకటించారు.