పోక్సో కోర్టు అదుర్స్.. యావజ్జీవ కారాగార శిక్ష...
దేశంలో మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్న వేళ.. దేశంలోనే తొలిసారిగా బీహార్‌లోని పోక్సో కోర్టు ఒక్క రోజులోనే అత్యాచార కేసును విచారించి సంచలనం సృష్టించింది. ఈ కేసు విచారణలో భాగంగా నిందితుడిని దోషిగా తేల్చి యావజ్జీవ కారాగార శిక్షతోపాటు రూ.50 వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే... బీహార్ రాష్ట్రంలోని అరారియా జిల్లాకు చెందిన వ్యక్తి జులై 22న ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు.
ఈ ఘటనపై ఆ తర్వాతి రోజు కేసు నమోదైంది. అక్టోబర్ నాలుగో తేదీన కేసు విచారణకు రాగా.. అదే రోజు పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి శశికాంత్ రాయ్ నిందితుడిని దోషిగా తేల్చి యావజ్జీవ కారాగార శిక్షతోపాటు రూ.50 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. అంతేకాదు, బాధితురాలికి రూ. 7 లక్షల జరిమానా చెల్లించాలని ఆదేశించారు. ఈ కేసుకు సంబంధించిన తీర్పు కాపీ తాజాగా వెలుగు చూసింది. ఈ కేసు విచారణకు సంబంధించిన వివరాలు నెట్టింట వైరల్ అయ్యాయి.