శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 జనవరి 2021 (18:47 IST)

కాలేజీ విద్యార్థినిలకు ప్రేమ పేరుతో వల.. ఫాంహౌస్‌కు తీసుకెళ్లి అత్యాచారం!

తమిళనాడులోని పొల్లాచ్చిలో కాలేజీ విద్యార్థులకు ప్రేమ పేరుతో వల వేసి లోబరుచుకుని ఫాంహౌస్‌కు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడిన కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో తాజాగా ఆ రాష్ట్రంలోని అధికార అన్నాడీఎంకేకు చెందిన ముగ్గురు నేతలను పోలీసులు అరెస్టు చేశారు. 
 
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, కోయంబత్తూరు సమీపం పొల్లాచ్చి వద్ద కాలేజీ విద్యార్థినులను ప్రేమ పేరుతో వంచించి కొందరు యువకులు శివారు ప్రాంతాల్లో ఫామ్‌హౌస్‌లో సామూహిక అత్యాచారాలకు పాల్పడి, వారిని సెల్‌ఫోన్లలో వీడియోలు తీసి బెదరింపులకు పాల్పడ్డారు. 
 
ఈ అత్యాచారాల కేసులో పొల్లాచ్చికి చెందిన తిరునావుక్కరసు (25), శబరి రాజన్‌ (25), వసంత్‌కుమార్‌ (27) సతీష్‌ (28), మణివన్నన్‌ (25) అనే వారిని 2019లో సీబీసీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ అత్యాచారాలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఓ బాధితురాలి సోదరుడిపై దాడికి పాల్పడిన నేరానికి ‘బార్‌’ నాగరాజ్‌ సహా మరి ముగ్గురిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. 
 
ఈ రెండు కేసులపై సీబీసీఐడీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కానీ విచారణ నత్తనడకన సాగుతుండటంతో రెండు కేసులను గతేడాది ఏప్రిల్‌లో సీబీఐకి బదిలీ చేశారు. సీబీఐ ఐజీ, అడిషనల్‌ ఎస్పీ సహా సీబీఐ అధికారులు అత్యాచారాలు జరిగిన ప్రాంతాల్లో దర్యాప్తు జరిపిన మీదట తాజాగా కేసులు నమోదు చేసి ఐదుగురిని తమ కస్టడీలోకి తీసుకుని విచారణ జరిపారు. 
 
ఇదిలావుండగా అత్యాచారాల కేసులో అరెస్టయిన ముగ్గురిలో అరుళానందం పొల్లాచ్చి నగర అన్నాడీఎంకే విద్యార్థి విభాగం కార్యదర్శిగా ఉంటూ పాత కార్ల వ్యాపారం చేస్తున్నాడు. అరుళానందం రాష్ట్రమంత్రి ఎస్పీ వేలుమణి, డిప్యూటీ స్పీకర్‌ పొల్లాచ్చి జయరామన్‌తో సన్నిహిత సంబంధాలు కలిగివున్నారంటూ వారితో అరుళానందం తీసుకున్న ఫొటోలు సోషల్‌ మీడియాలో సంచలనం కలిగిస్తున్నాయి. 
 
ఇటీవల జరిగిన అరుళానందం వివాహవేడుకల్లో రాష్ట్రమంత్రి సహా పలువురు  అన్నాడీఎంకే ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ఆ ఫొటోలు కూడా ప్రస్తుతం సోషల్‌ మీడియాలో కలకలం రేపుతున్నాయి. అరెస్టయిన ముగ్గురిని సీబీఐ అధికారులు మరోసారి విచారణ జరిపిన తర్వాత బుధవారం ఉదయం కోయం బత్తూరు మహిళాకోర్టులో వారిని హాజరుపరిచారు. ఆ ముగ్గురిని ఈనెల 20 వరకూ జ్యుడీషియల్‌ కస్టడీకి పంపుతూ మేజిస్ట్రేట్‌ ఉత్తర్వులు జారీ చేయడంతో వారిని జైలుకు తరలించారు.