శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 13 జూన్ 2020 (17:25 IST)

ఇదేం విధానం?.. మోదీపై రాహుల్ ఫైర్

కరోనా కేసులు దేశవ్యాప్తంగా రోజురోజుకూ పెరిగిపోతున్న క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై  కాంగ్రెస్‌ నేత, ఎంపీ రాహుల్‌ గాంధీ  ఆగ్రహం వ్యక్తం చేశారు.

'పిచ్చితనంతో పదే పదే ఒకే పనిని చేస్తూ భిన్నమైన ఫలితాలను ఆశిస్తున్నారంటూ' కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ ఆయన ట్వీట్‌ చేశారు.

ఈ మేరకు తన ట్విటర్‌ ఖాతాలో.. లాక్‌డౌన్‌ నాలుగు దశల్లో దేశ వ్యాప్తంగా కరోనా కేసులు నమోదైన తీరును గ్రాఫ్‌ల ద్వారా చూపించారు.

కాగా, మార్చి 24న ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటన చేసినప్పటికి దేశవ్యాప్తంగా కేవలం 500 కరోనా కేసులు ఉన్నాయి. రెండు నెలల సుదీర్ఘ లాక్‌డౌన్‌ అనంతరం ప్రస్తుతం భారత్‌లో 3 లక్షలకు పైగా కేసులు, 8 వేలకు పైగా మరణాలు నమోదయ్యాయి.

దేశంలో గడిచిన రెండు రోజుల్లో అత్యధికంగా రోజుకు 10 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మోడీ ప్రభుత్వం అన్‌లాక్‌ 1.0 పేరుతో సడలింపులు ఇచ్చింది.

దీంతో రాష్ట్రాల మధ్య రాకపోకలు, విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా రెస్టారెంట్లు, షాపింగ్‌ మాల్స్‌, ప్రార్థనా మందిరాలు తెరచుకోవడానికి అనుమతులు ఇచ్చింది.