సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జెఎస్కె
Last Modified: విజయవాడ , గురువారం, 2 సెప్టెంబరు 2021 (11:11 IST)

క‌రోనా కొత్త కేసులు, మరణాలు..దేనికి సంకేతం?క‌రోనా కొత్త కేసులు, మరణాలు..దేనికి సంకేతం?

దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. గత కొద్ది రోజులుగా కొత్త కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇది దేనికి సంకేత‌మ‌ని అంద‌రూ థ‌ర్డ్ వేవ్ పై ఆందోళ‌న చెందుతున్నారు. తాజాగా 24 గంటల వ్యవధిలో కొత్త కేసులు 47వేలు దాటగా, మరణాలు కూడా 500పైనే నమోదుకావడం గమనార్హం. అయితే, కొత్త కేసుల్లో 70 శాతం ఒక్క కేరళ రాష్ట్రంలోనే ఉన్నాయి.
 
గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 47,092 కొత్త కేసులు వెలుగు చూశాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3.28కోట్లు దాటింది. ఇదే సమయంలో 509 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 4,39,529 మందిని మహమ్మారి బలితీసుకుంది. ఇక నిన్న మరో 35,181 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 3.20కోట్ల మంది వైరస్‌ను జయించగా.. రికవరీరేటు 97.48శాతంగా ఉంది.
 
కరోనా రెండో దశ విజృంభణ నుంచి కేరళ ఇంకా బయటపడట్లేదు. అక్కడ నిన్న ఒక్కరోజే 32,803 కొత్త కేసులు వెలుగుచూశాయి. దేశవ్యాప్తంగా నమోదవుతోన్న మొత్తం కేసుల్లో మూడింట రెండొంతులు ఒక్క ఈ రాష్ట్రంలోనే ఉంటున్నాయి. ఇక ఇక్కడ మరణాల సంఖ్య కూడా భారీగానే ఉండటం కలవరపెడుతోంది. నిన్న ఆ రాష్ట్రంలో 173 మరణాలు నమోదయ్యాయి.
 
కొత్త కేసులు పెరుగుతుండటంతో క్రియాశీల కేసుల సంఖ్య మళ్లీ ఎక్కువవుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,89,583 మంది వైరస్‌తో బాధపడుతుండగా, యాక్టివ్‌ కేసుల రేటు 1.19శాతానికి పెరిగింది. ఇక దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోంది. నిన్న మరో 81 లక్షల మందికి టీకాలు వేశారు. ఇప్పటివరకు 66కోట్లకు పైగా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.