దేశంలో ఆందోళన కలిగిస్తున్న కరోనా బాధితుల మరణాలు

coronavirus
ఠాగూర్| Last Updated: గురువారం, 10 జూన్ 2021 (11:30 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. మరోవైపు, కరోనా బాధితులు మాత్రం విపరీతంగా చనిపోతున్నారు. ఇవి తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా వరుసగా మూడు రోజు కొవిడ్‌ కేసులు లక్షకు దిగువన నమోదవగా.. రికార్డు స్థాయిలో ఒకే రోజు 6,148 మరణాలు నమోదయ్యాయి.

కరోనా మహమ్మారి నుంచి ఇంత పెద్ద మొత్తంలో మరణాలు నమోదవడం ఇదే తొలిసారి. గడిచిన 24 గంటల్లో 94,052 కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్తగా 1,51,367 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారని పేర్కొంది.

తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,91,83,121కు చేరింది. ఇందులో 2,76,55,493 మంది బాధితులు కోలుకున్నారు. వైరస్‌ బారినపడి ఇప్పటి వరకు 3,59,676 మంది ప్రాణాలు వదిలారు.

ప్రస్తుతం దేశంలో 11,67,952 యాక్టివ్‌ కేసులున్నాయని చెప్పింది. టీకా డ్రైవ్‌లో ఇప్పటివరకు 23,90,58,360 డోసులు పంపిణీ చేసినట్లు వివరించింది. అయితే, బీహార్‌ మరణాల డేటాను సవరించిన నేపథ్యంలో మృతుల సంఖ్య ఈ స్థాయిలో పెరిగినట్టు తెలుస్తోంది.

మరోవైపు, క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య‌ను ఒక్క రోజులోనే బీహార్ సర్కార్ 72 శాతం పెంచేసింది. ఇన్నాళ్లూ త‌మ రాష్ట్రంలో క‌రోనాతో చ‌నిపోయిన వారి సంఖ్య 5500 అని చెబుతూ వ‌చ్చిన ఆ రాష్ట్రం.. తాజాగా 9429 మంది చ‌నిపోయిన‌ట్లు చెప్ప‌డం గ‌మ‌నార్హం. దీనిపై తీవ్ర దుమారం రేగుతోంది.

ఇది కేంద్ర ఆరోగ్య శాఖ రోజూ విడుద‌ల చేసే మ‌ర‌ణాల సంఖ్య‌పైనా ప్ర‌భావం చూపేదే. ఏప్రిల్‌-మే నెల‌ల్లో క‌రోనా సెకండ్ వేవ్ సంద‌ర్భంగా రాష్ట్రంలో ఎంత‌మంది చ‌నిపోయారో ప‌రిశీలించాల‌ని పాట్నా హైకోర్టు ఆదేశించింది. బీహార్ ప్ర‌భుత్వం కేసులు, మ‌ర‌ణాల సంఖ్య‌ను త‌క్కువ చేసి చూపిస్తోంద‌న్న వార్త‌ల నేప‌థ్యంలో కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.

దీంతో బుధ‌వారం మ‌రోసారి అన్ని జిల్లాల నుంచి వివ‌రాల‌ను తెప్పించుకున్న ప్ర‌భుత్వం ఒక్క‌సారిగా మ‌ర‌ణాల సంఖ్య‌ను భారీగా పెంచేసింది. గ‌తేడాది మార్చి నుంచి ఈ ఏడాది మార్చి వ‌ర‌కూ బీహార్‌లో కొవిడ్‌తో 1600 మంది చ‌నిపోగా.. ఆ రెండు నెల‌ల్లోనే మ‌రో 7775 మంది చ‌నిపోయిన‌ట్లు తేలింది. అంటే మ‌ర‌ణాల సంఖ్య ఏకంగా ఐదు రెట్లు పెరిగింది.

తాజా వివ‌రాల ప్ర‌కారం.. అత్య‌ధికంగా రాజ‌ధాని పాట్నాలో 2303 మంది చ‌నిపోయిన‌ట్లు ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. అయితే పాట్నాలోని మూడు శ్మ‌శాన వాటిక‌ల్లోని అధికారిక రికార్డుల ప్ర‌కారం 3243 మందిని కొవిడ్ బాధితుల అంత్య‌క్రియ‌లు జ‌రిగిన‌ట్లు తేలింది. ఇది మరిన్ని విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. సీఎం నితీశ్ కుమార్ సొంత జిల్లా న‌లంద‌లో 222 మంది చ‌నిపోయారు.దీనిపై మరింత చదవండి :